మర్యాదగా డబ్బులిచ్చెయ్.. పాక్ మంత్రికి చేదు అనుభవం - MicTv.in - Telugu News
mictv telugu

మర్యాదగా డబ్బులిచ్చెయ్.. పాక్ మంత్రికి చేదు అనుభవం

September 19, 2019

పార్లమెంట్‌లోనే ఓ పాక్ మంత్రికి పరాభవం ఎదురైంది. పార్లమెంట్ ఆవరణలోకి వచ్చినతను తన డబ్బులు తనకు ఇవ్వాలని మంత్రితో వాగ్వాదానికి దిగాడు. ‘మర్యాదగా నా డబ్బులు నాకు ఇస్తావా లేదా’ అని అందరు మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో ఆయన పరువు తీసేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ నేత సంబిత్ పాత్ర ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ఇదీ పాకిస్తాన్ పరిస్థితి అని కామెంట్ చేశారు. 

పాకిస్తాన్‌ రైల్వే మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌, జపాన్‌లో ఉంటున్న ఓ వ్యక్తి నుంచి కారు కొనుక్కున్నారట. ఇందుకుగానూ రూ. 22లక్షలు(పాక్‌ కరెన్సీలో) చెల్లించాల్సి ఉండగా.. ఇంకా ఇవ్వలేదు. రేపు ఇస్తాను, మాపు ఇస్తాను అంటూ వాయిదాలు పెడుతున్నారట. దీంతో విసుగు చెందిన జపాన్ వ్యక్తి సంగీతానికి చింతకాయలు రాలవని భావించి పాకిస్తాన్‌కు వచ్చేశాడు. గతవారం పాక్‌ పార్లమెంట్‌కు వెళ్లాడు. పార్లమెంట్‌లో అతన్ని చూసి రషీద్‌కు చల్లని చమట్లు పట్టాయట. ఏదో ఒకటి సర్ది చెబుదాం అనుకున్నారు మంత్రి. కానీ, అతను ఎలాగైన తన డబ్బులు తనకు ఇవ్వాలని మొండిపట్టుమీద వున్నాడు. రషీద్‌తో వాగ్వాదానికి దిగాడు. 

రషీద్‌ అతడిని వదిలించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ వ్యక్తి మాత్రం మంత్రిని ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నాడు. ‘మీ మాటపై నమ్మకంతో కారును జపాన్‌ నుంచి ఇక్కడకు పంపించాను. మీరు మాత్రం డబ్బులు ఇవ్వట్లేదు. నా బాకీ ఇస్తారా లేదా’ అంటూ పెద్దగా అరిచేస్తూ అందరిముందు మంత్రి గాలి అంతా తీసేశాడు. దీంతో మంత్రికి పరువు పోయినంత పనైంది. అతనికి ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలే ప్రయత్నం చేశారు. 

ఇందుకు సంబంధించిన వీడియోను ఇటీవల బీజేపీ నేత సంబిత్‌ పాత్రా ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘పాక్ పరిస్థితి ఇలా వుంది. ఆ దేశ రైల్వే మంత్రి కారు కొనుక్కుని డబ్బులు కూడా ఇవ్వలేదు. దీంతో ఆ వ్యక్తి పార్లమెంట్‌కు వచ్చి మంత్రిని నిలదీశాడు. వారి మధ్య చిన్న అణు యుద్ధమే జరిగింది’ అంటూ సంబిత్ పాత్ర ట్వీటారు. దీనిపై చాలామంది స్పందిస్తున్నారు. ‘మీకు పాకిస్తాన్‌ అంటే చాలా ప్రమ అనుకుంటాను. అందుకే ఎప్పుడూ పాకిస్తాన్ గురించి ఆందోళన చెందుతారు, కొన్నిసార్లు మన దేశం గురించి కూడా ఆందోళన చెందండి’ అని ఆయన ఫాలోవర్ ఒకరు కామెంట్ చేశాడు. కారు డబ్బులు కూడా చెల్లించలేని ఈ మనిషి రైల్వే మంత్రి ఎలా అయ్యాడో అర్థం కావడంలేదని మరో నెటిజన్ అన్నాడు.