భారత్‌తో యుద్ధానికి ముహూర్తం పెట్టిన పాక్ మంత్రి
కశ్మీర్ వ్యహారంలో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. తాటాకు చప్పుళ్లను మరింత పెంచింది. తమ ఉగ్రవాద వ్యవహారాల కారణంగ అంతర్జాతీయంగా ఏకాకి కావడంతో భారత్‌పై దూషణలకు తెగబడుతూ, ఫేక్ వీడియోలతో పాక్ నేతలు పరువు తీసుకుంటున్నారు. ఇంటా బయటా చుక్కలు ఎదురుకావడంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి చోటామోటా నేతల వరకు యుద్ధానికి కాలుదువ్వుతున్నారు.
కశ్మీరీలను కాపాడుకోవడానికి అణు యుద్ధానికి కూడా వెనుదీయబోమని ఇమ్రాన్ మొన్న హెచ్చరించడం తెలిసింతే. ఈ రోజై పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ ఏకంగా భారత్‌తో యుద్ధానికి ముహూర్తం కూడా పెట్టేశారు. అక్టోబర్, నవంబర్‌లో రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని ప్రకటించారు. ఆయన ఈ రోజు రావల్పిండిలో విలేకర్లతో ముచ్చటించారు.
‘అక్టోబర్, నవంబర్ ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం జరగొచ్చు. కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించాలనుకుంటే ఐక్యరాజ్యసమితి ఇప్పటికే అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ఉండేది. ఏదేమైనా మేం కశ్మీరీల వైపు ఉంటాం. నరేంద్ర మోదీ నిరంకుశత్వం వల్ల కశ్మీర్ వినాశానికి చేరువైంది. ఇతర ముస్లిం సమాజాలు మౌనంగా ఉండడం సరికాదు. భారత్‌తో చర్చల గురించి మాట్లాడ్డం తెలివితక్కువ తనమే. ’ అని రషీద్ అన్నారు. కాగా, భారత్ నుంచి వచ్చే విమానాలకు తమ గగనతలాన్ని శాశ్వతంగా మూసేయాలని పాక్ యోచిస్తోంది. ఈ పనిచేస్తే భారత్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టినట్లు అవుతుందని భావిస్తోంది. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండుగా విభజించడానికి పాక్ జీర్ణించుకోవడం లేదు.