Home > Featured > అల్లాడిపోతున్న పాక్.. కార్లు కొనకుండా నిషేధం..

అల్లాడిపోతున్న పాక్.. కార్లు కొనకుండా నిషేధం..

పాకిస్తాన్‌లో ప్రభుత్వ అధికారులకు అక్కడి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. దేశంలో రోజు రోజుకు పెరుగుతోన్న ద్రవ్య లోటును కట్టడి చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలను అమలు చేస్తోంది. తాజాగా ప్రభుత్వాధికారులు కొత్త కార్లను కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది. దాంతో కార్లను కొనాలని ఆశగా ఎదురుచూస్తున్నా అధికారులు, ధనవంతులు నానా అవస్థలు పడుతూ అల్లాడిపోతున్నారు.

పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ మాట్లాడుతూ.." పాకిస్తాన్‌లో ఉన్న ధనవంతులపై పన్నులను పెంచాం. ప్రభుత్వ అధికారులు కొత్త కార్లను కొనుగోలు చేయకుండా ఆంక్షలు పెట్టాం. ఇంజిన్ సామర్థ్యం 1600 లేదా ఆపైన ఉన్న ఎస్‌యయూవీలు, కొన్ని సెడాన్లపై పన్నులను కూడా రెండింతలు పెంచాం. పెరుగుతోన్న ద్రవ్య లోటును కట్టడి చేసేందుకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి బెయిల్ అవుట్ మనీని పొందేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. 22 కోట్ల మంది జనాభా కలిగిన పాకిస్తాన్ ప్రస్తుతం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విదేశీ నిల్వలు దేశంలో 10 బిలియన్ డాలర్ల కిందకి పడిపోయాయి. ఈ నిల్వలు కేవలం 45 రోజుల దిగుమతుల కోసం మాత్రమే ఉన్నాయి. కరెంట్ అకౌంట్, ద్రవ్య లోటులు పెరుగుతూ సంక్షోభ కట్టలు తెంచేలా ఉన్నాయి" అని ఆయన అన్నారు.

మరోపక్క బెయిల్ అవుట్ ప్యాకేజీని విడుదల చేయాలంటే ప్రస్తుతం దేశంలో పెరుగుతోన్న ద్రవ్య, కరెంట్ అకౌంట్ లోట్లను కట్టడి చేయాలని ఐఎంఎఫ్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ లోటులను తగ్గించేందుకు పన్ను ఎగవేతలను తగ్గించనుందని ఇస్మాయిల్ తెలిపారు. ఈ ఎగవేతలను తగ్గించడం ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూలు 7 ట్రిలియన్ పాకిస్తాన్ రూపాయలకు పెరుగుతాయని భావిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీలో ద్రవ్యలోటును 4.9 శాతానికి తీసుకురావాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రస్తుతం ఇది 8.6 శాతంగా ఉంది. ప్రైవేటీకరణ ద్వారా ప్రభుత్వం 96 బిలియన్ పాకిస్తానీ రూపాయలను సేకరిస్తోంది. ఐఎంఎఫ్ షరతులను తాము ఇప్పటికే అమల్లోకి తెచ్చామని అక్కడి ప్రభుత్వం చెబుతున్నట్లు సమాచారం.

Updated : 11 Jun 2022 3:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top