పరువుహత్య.. మేనత్తను చంపిన తొమ్మిదేళ్ల బాలుడు - MicTv.in - Telugu News
mictv telugu

పరువుహత్య.. మేనత్తను చంపిన తొమ్మిదేళ్ల బాలుడు

September 24, 2020

pakistan 9-year-old boy incident

దాయాది దేశం పాకిస్తాన్‌లో పరువు హత్యలు సర్వసాధారణం అయిపోయాయి. సగటున ఏడాదికి వెయ్యి పరువుహత్యలు జరుగుతున్నాయని అక్కడి నేర రికార్డులు వెల్లడిస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ పరువు హత్యే ఇందుకు నిదర్శనం. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో 30 ఏళ్ల మహిళను తొమ్మిదేళ్ల పిల్లాడు హత్య చేశాడు. లాహోర్‌కు 200 కి.మీ. దూరంలోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న సర్గోదా గ్రామంలో ఈ దర్మాణం జరిగింది. ఈ గ్రామానికి చెందిన మహిళ పదేళ్ల క్రితం తన కుటుంబానికి ఇష్టంలేదని ప్రేమ పెళ్లి చేసుకుని కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయింది. ఆమెకు ముగ్గురు పిల్లలు పుట్టారు. 

ఇటీవల కొంతకాలంగా ఆ మహిళతో కుటుంబసభ్యులు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఇంట్లో శుభకార్యం ఉందంటూ ఆమెను సోదరుడు ఇంటికి ఆహ్వానించాడు. స్వయంగా అన్న పిలవడంతో ఆమె ఆ శుభకార్యానికి వెళ్ళింది. ఈ సందర్భంగా ఆమె సోదరుడు తన 9 ఏళ్ల కుమారుడికి తుపాకీ ఇచ్చి మేనత్తను కాల్చమని చెప్పగా, ఆ బాలుడు పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆమె సంఘటన స్థలంలోనే మరణించింది. ఈ ఘటన తర్వాత ఆమె అన్న కుటుంబం ఆ ఊరి నుంచి పారిపోయింది. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలుడికి తన తండ్రి గత కొన్ని రోజులుగా తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇస్తున్నాడని తెలుస్తోంది.