ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కాలని భావిస్తున్న పాకిస్తాన్ మినీ బడ్జెట్‌ని రూపొందించి ఆమోదించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పొదుపు చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా విదేశాల్లోని దౌత్య కార్యాలయాల సంఖ్య కుదింపు, ఎంపిక చేసిన కార్యాలయాలకు ఉచిత విద్యుత్ కోత, రిటైర్డ్ జడ్జీలు, ప్రభుత్వ ఉద్యోగులకు అందించే సౌకర్యాలు, పింఛన్లలో కోతలు వంటివి విధించాలని ప్రధాని షెహబాజ్ షరీఫ్ బుధవారం ఆదేశించారు. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై నిషేధం, మూడేళ్ల నుంచి భర్తీ కాకుండా మిగిలిన పోస్టుల తొలగింపు, కేంద్ర సెక్రటేరియట్ సైజు తగ్గించడం వంటి చర్యలు చేపట్టింది.
మరొక కీలక విషయం ఏంటంటే.. ఐఎస్ఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగాలకు నిధులను పరిమితం చేసింది. విచక్షణాపరంగా కేటాయించే నిధులను కూడా తగ్గించింది. ఈ చర్యలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూసి తర్వాత ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. కాగా, గతంలో తీసుకున్న అప్పు చెల్లించకపోవడం, కొత్త అప్పు పుట్టకపోవడం, వరదలతో వ్యవసాయం దెబ్బతినడంతో ఆహార కొరత వెరసి పాక్‌ను దిగ్భంధనం చేశాయి.