హనీ ట్రాప్.. అమ్మాయిలతో గుట్టుచప్పుడు కాకుండా సీక్రెట్స్ రాబట్టే ఆపరేషన్. మగవాడి బలహీనతను ఆసరాగా తీసుకుని ట్రాప్లో పడేసి దొడ్డిదారిలో సైనిక రహస్యాలను, సైన్స్ రహస్యాలను రాబట్టి శత్రుదేశాన్ని తిప్పలుపెట్టే కుట్ర. శత్రువును ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ముధైర్యం లేక, అడ్డదారిలో అమ్మాయితో పనికానిచ్చే పురాతన కాలం నాటి వ్యూహం. ఇందులో దాయాది దేశం పాకిస్తాన్ ఆరితేరింది. భారత సైనికులకు పాక్ భామలు తీపి వలవేసి రహస్యాలు రాబట్టిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఇందులో నిజం లేదని పాక్ బుకాయిస్తున్నా నిజం బయటికి వచ్చేసింది. అందమైన అమ్మాయిలను రంగంలోకి దింపి హనీ ట్రాప్ చేయిస్తున్నట్లు పాక్ ఆర్మీ రిటైర్డ్ అధికారి మేఝీర్ అదిల్ రజా చెప్పాడు. ‘సోల్జర్ స్పీక్’ పేరుతో యూట్యూబ్ చానల్ నడుపుతున్న ఆయన ఈ విషయంపై గట్టురట్టు చేశారు. ముగ్గులోకి దింపుతున్న భామల పేర్లేమిటో ఆయన చెప్పకున్నా పలువురు నటీమణులు పేర్లు బయటికొచ్చాయి.
దివంగత బాలీవుడ్ నటి శ్రీదేవితో ‘మామ్’ సినిమాలో నటించిన పాక్ నటి సజల్ అలీతోపాటు మహిరా ఖాన్, కుబ్రా ఖాన్, మెహ్విష్ హయత్లు ‘వలపు వలలు’ వేస్తున్నట్లు ఇంటర్నెట్ జనం చెప్పుకుంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్లతో పోలిస్తే వీరికి పాకిస్తాన్లో అటు రెమ్యునరేషన్, ఇటు పేరుప్రతిష్టలు రెండూ తక్కువే కావడం, ‘దేశభక్తి’ కూడా తోడు కావడంతో ఆర్మీ చెప్పినట్లు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సజల్ అలీ ఈ వార్తలపై తీవ్రంగా స్పందింది. ‘‘ఇది నా వ్యక్తిత్వాన్ని కించపరచడమే. మా దేశం పరువు తీస్తున్నారు, ’’ అని చెప్పుకొచ్చింది. రజాపై కేసు పెడతానని మరో భామ కుబ్రా ఖాన్ హెచ్చరించింది. ‘‘ఏవో అవాకులు చవాకులు పేలుతున్నారని మొదట్లో ఊరుకున్నాను. ఇప్పుడు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మేం హనీ ట్రాప్ చేస్తున్నట్లు అదిల్ రజా ఆధారాలు చూపి మరీ మాట్లాడాలి’’ అని అంది.