Pakistan banned the movie Joyland
mictv telugu

ఆస్కార్‌కి వెళ్లిన సినిమాను నిషేధించిన పాకిస్తాన్.. కంటెంటే కారణం

November 17, 2022

Pakistan banned the movie Joyland

మతతత్వ దేశమైన పాకిస్తాన్‌ ఆస్కార్ ఎంట్రీ ఇచ్చిన చిత్రంపై నిషేధం విధించింది. ఇస్లాం మత విశ్వాసాలకు విరుద్ధంగా స్వలింగ సంపర్కం నేపథ్యంలో ఉన్నందున ‘జాయ్‌లాండ్’ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. ఈ చిత్రం కేన్స్ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన తొలి పాకిస్తానీ చిత్రం కావడం విశేషం.

అంతేకాక, చిత్ర దర్శకుడికి స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. దాంతో పాటు ఆస్కార్ అవార్డుకు పాకిస్తాన్ తరపున ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ యూట్యూబులో రిలీజైంది. థియేటర్ ఆర్టిస్టుగా జీవనం సాగించే ట్రాన్స్‌‌జెండర్‌తో ఓ యువకుడు ప్రేమలో పడడం ఈ చిత్ర కథాంశం. సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరం కావడంతో ఈ చిత్రానికి అనుమతి ఇచ్చే విషయమై ప్రధాని నేతృత్వంలో ఓ కమిటీ గత మంగళవారం భేటీ అయింది. ఈ సందర్భంగా.. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తామని, కానీ ఆ పేరుతో తప్పుడు సమాచారం ప్రసారం చేస్తే అనుమతించమని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కొన్ని మైనర్ కట్స్‌తో ఈ చిత్రం శుక్రవారం విడుదలయ్యేందుకు అనుమతిచ్చారని విశ్వసనీయ సమాచారం. కాగా, 2020లో పాకిస్తాన్ తరపున ఆస్కార్‌‌కి ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా ‘జిందగీ తమాషా’ను కూడా పాక్ ప్రభుత్వం నిషేధించింది. ముస్లింలను తప్పుదోవ పట్టించేలా ఉందని తెహ్రీక్ ఎ లబ్బేక్ అనే రాజకీయ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడంతో నిషేధం తప్పలేదు.