సరిహద్దులో పాకిస్తాన్ తాజా పాపం.. చైనా డ్రోన్లతో.. - MicTv.in - Telugu News
mictv telugu

సరిహద్దులో పాకిస్తాన్ తాజా పాపం.. చైనా డ్రోన్లతో..

September 25, 2019

ఆర్టికల్ 370 రద్దుతో కడుపుమంటతో వున్న పాకిస్తాన్ పంజాబ్ సరిహద్దు జిల్లా తర్న్ తరాన్‌లో డ్రోన్ల ద్వారా భారీగా ఆయుధాలను జారవిడిచింది. సరిహద్దుల్లో భారీగా కాల్పుల ఉల్లంఘనకు పాక్ పాల్పడటం కలకలం రేపుతోంది. ఆయుధాలతో పాటు ఏకే-47 రైఫిల్స్, శాటిలైట్‌,  డ్రగ్స్, గ్రనేడ్లు, మొబైల్‌ ఫోన్లు, నకిలీ కరెన్సీ కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ నెలలో ఎనిమిది రోజుల పాటు ఓ డ్రోన్ అక్కడ ఎనిమిది సార్లు చక్కర్లు కొట్టినట్టు విచారణలో వెల్లడైంది. పాక్ చర్యపై పంజాబ్ పోలీసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. 26/11 తరహాలో పంజాబ్ సహా సరిహద్దు రాష్ట్రాల్లో దాడులకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. డ్రోన్ల సాయంతో ఆయుధాలు, పేలుడు పదార్థాలను జారవిడిచి వినాశనానికి ప్రయత్నిస్తోందని.. దీనికి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ పూర్తిగా సహకారం అందజేస్తోందని తెలిపారు.

ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం తర్న్ తరాన్ జిల్లాలో నలుగురు ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో డ్రోన్ తగలబెట్టేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించగా అది విఫలమైంది. దానిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. లోతుగా విచారించడంతో పాక్ దురాలోచన బయటపడింది. డ్రోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు. రాడార్లకు చిక్కుకుండా ఈ డ్రోన్లు ఎలా చొరబడ్డాయనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. చైనాలో తయారైన డ్రోన్ల సాయంతో సులువుగా 10 కిలోల పేలోడ్స్, ఆయుధాలను జారవిడిచినట్టు గుర్తించారు. ఖలీస్థాన్ ఉగ్రవాదులు సెప్టెంబరు 9 నుంచి 16 మధ్య అరెస్టైన ఉగ్రవాది అక్షదీప్ పాక్‌లోని ఖలిస్థాన్ ఉగ్రవాది రంజీత్ సింగ్ నీతా తనతో సంప్రదించినట్టు వెల్లడించాడు. జర్మనీలో ఉన్న మరో ఉగ్రవాది గుర్మీత్ సింగ్ అలియాస్ బగ్గా ద్వారా అతడి ఫోన్ నంబరు లభించినట్టు వివరించాడు. 

pakistan.

ఈ సమస్యని తక్షణమే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అన్నారు. కాగా, ఈ ఆయుధాలను జమ్మూ-కశ్మీర్‌కు తరలించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని ఓ సీనియర్‌ పోలీస్ అధికారి చెప్పారు. శాటిలైట్‌ ఫోన్లు లభించడమే దీనికి నిదర్శనమని, లోయలో ఇంటర్నెట్ సేవలను నిషేధించడంతో వీటిని ఉగ్రవాదులకు చేరవేయడానికి పంపి ఉంటారని అనుమానిస్తున్నారు.

దీనిపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందిస్తూ.. ‘ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా భారత సైన్యం సంసిద్ధంగా ఉంది. దేశ భద్రత విషయంలో వెనడుగు వేసే ప్రసక్తే లేదు. ఖలిస్థాన్ వేర్పాటువాదుల సాయంతో పాక్‌ మూకలు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ముష్కరులు భారత్‌లో భారీ దాడులకు యత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు చేస్తున్న హెచ్చరికలకు బలం చేకూరుతోంది’ అని తెలిపారు.