పాకిస్తాన్‌లో అంతర్యుద్ధం..  దాడులు, దగ్ధాలు, కాల్పులు.. - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్‌లో అంతర్యుద్ధం..  దాడులు, దగ్ధాలు, కాల్పులు..

November 25, 2017

పాకిస్తాన్‌ లో ఒక్కసారిగా అంతర్యద్ధం లాంటి పరిస్థితి తలెత్తింది. ఇస్లామిస్టులు వేల సంఖ్యలో రోడ్లపైకొచ్చి దాడులకు తెగబడుతున్నారు. పోలీసులను, సైనికుల చేతికందిన ఆయుధాలతో దాడి చేస్తున్నారు. ఒక పోలీసును చంపేశారు. గొడవల్లో 130 మంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

 శనివారం ఇస్లామాబాద్‌, రావల్పిండి నగరాల్లో. ఇస్లామిస్టులు నిరసనకు దిగారు. పోలీసులు, జావాన్లు వారిపై బాష్పవాయువు ప్రయోగించి, రబ్బరు బుల్లెట్లు కాల్చారు. నిరసనకారులు కూడా పోలీసుల వాహనాలను, చెక్ పోస్టులను తగలబెట్టారు. ఇస్లామాబాద్‌లో దాదాపు 3వేల మంది ఇస్లామిస్టులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అల్లర్లను అదుపులో ఉంచడానికి 10వేల మంది పోలీసులు, జవాన్లను రంగంలోకి దింపింది.

అల్లర్లను ప్రత్యక్ష ప్రసారం చేసిన టీవీ చానళ్లపై సర్కారు నిషేధం విధించింది. చట్టసభల ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మహ్మద్ ప్రవక్త పేరుపైనా కాకుండా అంతరాత్మ సాక్షిగా, లేకపోతే మరోలా ప్రమాణం చేయడానికి వీలు కల్పించే ప్రతిపాదనను ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిపై ఇస్లామిక్ ఛాందసవాదులు భగ్గుమంటున్నారు.. మూడు వారాల నుంచి కొనసాగుతున్న నిరసనలు శనివారం పతాకస్థాయికి చేరాయి.