ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం దొరక్క అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. గోధుమ పిండి కోసం కొట్టుకున్న దృశ్యాలను చూస్తున్నాం. దీంతో పాకిస్థాన్ స్వరంలో మార్పు కనిపిస్తోంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారుతోంది. పాకిస్థాన్ గుణపాఠం నేర్చుకుందని, ఇప్పుడు శాంతియుతంగా జీవించాలని కోరుకుంటోందని ఆయన అన్నారు. భారత్తో మూడుసార్లు యుద్ధాలు చేసిన తర్వాత పాకిస్థాన్ గుణపాఠం నేర్చుకుందని అన్నారు. మూడు యుద్ధాలు చేసిన ప్రతిసారీ ప్రజలకు మరింత కష్టాలు, పేదరికం, నిరుద్యోగాన్ని తీసుకొచ్చామని అన్నారు. తాము ప్రశాంతంగా బతకాలనుకుంటున్నామని ప్రాధేయపడ్డారు.
అల్ అరేబియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని మాట్లాడుతూ ప్రతి సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు షెహబాజ్. చర్చలకు కూర్చొని ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలని భారత నాయకత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. తమ వద్ద ఇంజినీర్లు, డాక్టర్లు, నైపుణం ఉన్న కార్మికులు ఉన్నారని, దేశ సౌభాగ్యం కోసం వాళ్లను వాడుకోవాలని, ఈ ప్రాంతంలో సుస్థిర శాంతి కోసం ఆ చర్యలు తప్పవని, రెండు దేశాలు కూడా పురోగమిస్తాయని షరీఫ్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. బాంబులు, ఆయుధాల సేకరణ కోసం తమ నిధుల్ని వృధా చేయాలని లేదని షెహబాజ్ వెల్లడించారు.
అణుశక్తి గురించి మాట్లాడిన షెహబాజ్ షరీఫ్… యుద్ధం ఎవరికీ మంచిది కాదన్నారు. తాము అణ్వాయుధాలు కలిగి ఉన్నామని యుద్ధాని కోరుకుంటే.. ఏం జరిగిందో చెప్పడానికి ఇంకా జీవించేది ఎవరు. భారత్- పాక్ మధ్య కీలక పాత్ర పోషించగలరని యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ కు చెప్పానన్నారు. ఇక పాకిస్తాన్ లో తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. విదేశాల నుంచి సహాయం కూడా మాత్రం అంతంతగానే అందుతోంది. ఇటువంటి దారుణ పరిస్థితుల్లో శాంతిపేరుతో భారత్తో చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటిస్తోంది.