పాకిస్తాన్‌లోని హిందూ మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోంది. వారిపై దాడులు ఆగడం లేదు. హిందూ యువతుల కిడ్నాప్‌లు కూడా పెరిగిపోతున్నాయి. హిందూ యువతులను ముస్లింలు ఇదివరకు కిడ్నాప్ చేసి, మతం మార్చి పెళ్లి చేసుకునేవారు. కొందర్ని చంపేసేవారు. ప్రస్తుతం అంతటితో ఆగకుండా వారిని విదేశాలకు కూడా అమ్మేస్తున్నారు.
పాక్‌లోని హిందూ యువతులను కొందరు నిర్బంధించి చైనాకు అమ్మేస్తున్నట్లు అంబాసిడర్ ఎట్-లార్జ్ సామ్యూల్ డీ బ్రౌన్బ్యాక్ బయటపెట్టారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. హిందువులతోపాటు క్రైస్తవ, సిక్కు యువకులను కూడా అమ్మేస్తున్నట్లు వెల్లడించారు. యువతులను కిడ్నాప్ చేసిన తర్వాత వారిని దేశం దాటిస్తున్నారు. చైనా పురుషులకు ఉంపుడుగత్తెలుగా పంపిస్తున్నారు. బాధిత యువతుల్లో కొందర్ని చైనావారు పెళ్లి చేసుకుంటున్నారు. కొందరిని వ్యభిచార కూపంలో దింపుతున్నారు. 2018-2019 మధ్య కాలంలో చైనా పురుషుల కోసం 629 మంది పాక్ యువతులను అమ్మేశారు.
చైనాలో పెళ్లి చేసుకోడానికి యువతులు దొరకనివారు పాక్‌లోని మానవ స్మగ్లర్లను ఆశ్రయిస్తున్నారు. కిడ్నాప్ ముఠాలు.. మైనారిటీలైన హిందువులపై దాడి చేసి అమ్మాయిలను తీసుకెళ్తున్నారు. పాకిస్తాన్లో హిందువులపై వివక్ష ఉండడంతో ఈ దుర్మార్గాలను అడ్డుకోడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొన్ని మానవ హక్కుల సంఘాలు దీనిపై నిరసన తెలిపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా సింధు రాష్ట్రంలోని గోట్కీ, ఉమర్కోట్ ప్రాంతంలో హిందూ యువతుల కిడ్నాపులు భారీగా సాగుతున్నాయి. హిందూ యువతుల అక్రమ రవాణాకు కొంతమంది పాక్ అధికారులు, రాజకీయ నేతలు కూడా సహకరిస్తున్నారు. ఈ రాకెట్ వెనుక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.