భారతీయ సిక్కులకు పాక్ అరుదైన కానుక - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయ సిక్కులకు పాక్ అరుదైన కానుక

October 30, 2019

సిక్కుల మత గురువు గురునానక్ పుణ్యక్షేత్రమైన గురుద్వారా దర్భార్ సాహిబ్‌ను జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవాలని ప్రతీ సిక్కు భావిస్తాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్ నారోవాల్ జిల్లాలో దర్భార్ సాహిబ్‌ పుణ్యక్షేత్రం ఉంది. భారతీయ సిక్కులు దర్భార్ సాహిబ్‌ను సులభంగా సందర్శించుకోవడానికి కర్తార్‌పూర్ కారిడార్‌ను నిర్మించారు. దీనిని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నవంబర్ 9న ప్రారంభించనున్నారు. ఈ కారిడార్ ద్వారా తొలి విడత బృందం నవంబర్ 9న బయలుదేరనుంది. తొలి విడత యాత్రీకుల బృందంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు హర్తీప్ పూరి, హర్సిమత్రత్ కౌర్ బాదల్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్‌తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యే ఉన్నారు. 

కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా సాహిబ్‌కు వెళ్లే 575 మంది తొలి విడత యాత్రికుల జాబితాను భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు అందజేసింది. సిక్కుల మత గురువు గురునానక్ 550వ జయంతి సందర్భంగా గురునానక్ స్మారక నాణాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. 50 రూపాయలు విలువైన ఈ నాణెంతో పాటు, 8 రూపాయలు విలువ చేసే పోస్టల్ స్టాంప్‌‌ను కర్తార్‌పూర్ సాహిబ్‌లో యాత్రికులకు అందుబాటులో ఉంచుతామని తెలిపింది. దర్భార్ సాహిబ్‌ను సందర్భించే ప్రతీ భారతీయుడి నుంచి పాకిస్థాన్ 20 అమెరికన్ డాలర్లను సర్వీస్ చార్జీగా వసూలు చేస్తుంది. గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సందర్శించాలనుకునే యాత్రికులకు 11,000 రూపాయలు, 7 కిలోల సమను తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది.