భారత్‌లో ఉగ్రవాద దాడులు జరిపి వందలాది ప్రజలను, భద్రతా బలగాలను బలితీసుకున్న పాకిస్తాన్ జిహాదీ ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భారత్ దెబ్బకు తట్టుకోలేక పాకిస్తాన్‌లో సేఫ్‌గా తలదాచుకుంటున్న ఈ మూక గుట్టుచప్పుడు కాకుండా పైకిపోతోంది. ‘గుర్తు తెలియని వ్యక్తులు’ వీళ్లను వెంటాడి వేటాడి చంపేస్తున్నారు. ఇంతవరకు ముగ్గురు మాజీ జిహాదీ కమాండర్లను ఈ విధంగా మట్టుబెట్టారు. మరో చోటా ఉగ్రవాద కమాండర్లు కూడా హతం కాగా, మరికొందరిపై హత్యాయత్నాలు జరిగాయి. దాదాపు ఏడాది వ్యవధిలోనే ముగ్గురు కీలక జీహాదీలను చంపడం, వీరిలో ఇద్దరు మూడు రోజుల తేడాతో హత్యకు గురికావడం గమనార్హం. ఇది ‘రా’ వంటి భారత నిఘా వర్గాల పనేనని వార్తలు వస్తున్నాయి. పాక్ ప్రభుత్వం కూడా అదే అంటోంది!
ఎవరెవర్ని?
గత నెల ఫిబ్రవరి 26న కరాచీలో ఖలీద్ రజా అనే జిహాదీని మోటార్ బైక్‌పై వచ్చిన ఆగంతకుడు కాల్చి చంపాడు. అదే నెల 20న రావల్పిండిలో బషీర్ అహ్మద్ అనే మాజీ ఉగ్రనాయకుడు కూడా అదేవిధంగా హత్యకు గురయ్యాడు. బైకులపై వచ్చిన ఇద్దరు ముసుగు వ్యక్తులు అతణ్ని ఫర్నీచర్ షాపులో కాల్చేశారు. 2022 మార్చిలో కరాచీలోని అఖ్తర్ కాలనీలో మిస్త్రీ జాహిద్ ఇబ్రహీం అనే మాజీ జిహాదీ కమాండర్‌ను కూడా మోటర్ బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి గురి చూసి కాల్చి చంపేశాడు. హతులందరూ భారత్‌లో ఉగ్రవాద దాడులకు పాల్పడినవారూ, వారిని మట్టుబెట్టిన వారు బైకులపైనే వచ్చి కాల్చడం వంటివి చూస్తే ఇవి పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యలని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. పాక్‌లోని కొన్ని మిలిటెంట్ సంస్థలు ఈ హత్య చేసింది తామేనని ప్రకటిస్తున్నా, ఎందుకు చంపారో చెప్పకపోవడంతో గందరగోళం నెలకొంది.
హతుల రక్తచరిత్ర
సయ్యద్ ఖలీద్ రజా కశ్మీర్‌లో 1990లో దాడులు చేయించాడు. ఇతడు పనిచేసిన అల్ బదర్ అనే ఉగ్రవాద సంస్థ భారత జవాన్లను టార్గెట్ చేసుకునేది. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా ఒత్తిడితో పాక్ ప్రభుత్వం కొన్ని జిహాదీలపై చర్యలు తీసుకోవడంతో ఇతడు తుపాకీని వదలి స్కూలు నడుపుతున్నాడు. రావల్పిండిలో హతమైన బషీర్ అహ్మద్ 1980లలో హిజ్బుల్ ముజాహిదీన్ తరపున కశ్మీర్‌లో ఉగ్ర బీభత్సం సృష్టించాడు. తర్వాత పాక్ వెళ్లి ఆ సంస్థకు నాయకత్వం వహించారు. మరో హతుడు మిస్త్రీ జాహిద్ ఇబ్రహీం జైష్-ఎ-మహమ్మద్ కమాండర్. 1999నాటి భారత విమానం హైజాక్‌లో ఇతని పాత్ర ఉంది. నేపాల్ నుంచి వస్తున్న ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేసి కాబూల్‌కు తీసుకెళ్లిన కేసులో ఇతనికి జైలు శిక్ష పడింది.