శ్రీలంక దేశంలో గతకొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, కూరగాయాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు పార్లమెంట్‌ను ముట్టడించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కొంతమంది దేశాన్ని విడిచిపోతే, మరికొంతమంది శ్రీలంక ప్రధానిపై మండిపడుతూ, ధర్నాలు, రాస్తారోకులు, నిరసనలు చేపట్టారు. దీంతో చేసేదేమి లేక శ్రీలంక ప్రభుత్వం అప్పులను తీర్చలేక చేతులు ఎత్తేసింది. ఇప్పుడు పాకిస్తాన్ దేశం సైతం శ్రీలంక బాటపట్టింది.
పాకిస్తాన్లో ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. దీంతో ప్రజలపై మరింత భారం పడనుంది. ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ (ఓఆర్ఎ) సూచనల మేరకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా పెంచాలని నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచే కొత్త ధరలు అమలులోకి వస్తాయని, లీటరు పెట్రోలుపై రూ. 83.5, డీజిలుపై రూ. 119 పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా చమురు ఉత్పత్తుల ధరలు సైతం భారీగా పెరగనున్నాయి.
లైట్ డీజిలు పైన రూ.77.31, కిరోసిన్ పైన రూ.36.5 మేర పెంచాలని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ధరలు అమలైతే పాక్ ప్రజలకు ఇంధనం మరింత భారంగా మారుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో పెట్రోలు, డీజిల్‌పై 17 శాతం జీఎస్టీ వసూలు చేస్తుండగా, దీన్ని ఏకంగా 70 శాతానికి పెంచాలని ఓజీఆర్ఎ ప్రతిపాదించింది. ఈ విషయమై ప్రధాని షహబాజ్ షరీఫ్‌ను సంప్రదించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్థికశాఖ వెల్లడించింది.
మరోపక్క పాక్ ప్రజలు కరెంటు లేక నానా కష్టాలు పడుతున్నారు. కరాచీలో లోడ్ షెడ్డింగ్ కారణంగా విద్యుత్తును సరఫరా చేయలేకపోవడంతో ప్రజలు అంధకారంలోనే గడుపుతున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్ధనలు కూడా చీకట్లోనే చేసుకోవాల్సి వస్తోందని అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో చేసేదేమి లేక పాకిస్తాన్ ప్రభుత్వం అన్ని ధరలను భారీగా పేంచేందుకు నిర్ణయాలు తీసుకుంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. పాకిస్తాన్ కూడా మరో శ్రీలంక దేశంల మారిపోతుందని భయపడుతున్నారు.