మా వద్ద చాక్లెట్ సైజ్ అణుబాంబులు ఉన్నాయి.. పాక్ మంత్రి
భారత్‌తో దాయాది దేశం పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. పూటపూటక విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు అక్కడి నేతలు. ఇప్పటికే అణు యుద్ధం తప్పదంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి మర్చిపోక ముందే మరో మంత్రి మాట తూలాడు. తమ వద్ద అతి చిన్న అణుబాంబులు ఉన్నాయంటూ ఆ దేశ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వ్యాఖ్యానించారు. పంజాబ్ ప్రావిన్స్‌లో రైల్వే భవనం పరిశీలించేందుకు వెళ్లిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అక్టోబర్, నవంబర్ నెలల్లో భారత్, పాక్ మధ్య యుద్ధం జురుగుతందని ఇటీవల చెప్పింది ఈయనే.
పాకిస్తాన్ వద్ద చాక్లెంట్ అంత సైజులో అణుబాంబులు ఉన్నాయని ఆయన తాజాగా సెలవిచ్చారు. ఒక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేయగల 125 నుంచి 250 గ్రాముల అణుబాంబులు తమ వద్ద ఉన్నాని బెదిరింపులకు పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌తో తమ మైత్రి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయంటూ వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల ఆయన ప్రధాని నరేంద్ర మోదీపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుండగా ఒక్కసారిగా షాక్ కొట్టింది. వెంటనే తన సభను మోదీ ఆపలేరంటూ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఆయన మరోసారి ఇలా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
కాగా ఇప్పటికే పాక్ తీరుపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కశ్మీర్ అంశం భారత్ అంతర్గత విషయమని వ్యాఖ్యానించాయి. అయితే పాక్ మాత్రం అణుయుద్ధాన్ని భూచిగా చూపిస్తూ బెదిరింపు చర్యలకు పాల్పడుతోంది.