మసూద్ అజార్ విడుదల..భారీ కుట్రకు పాక్ పన్నాగం!
కశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తోన్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో భారత్‌పై ఉగ్రకుట్రకు పాల్పడేందుకు పాకిస్తాన్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్‌ను జైలు నుంచి రహస్యంగా విడుదల చేసింది. దీంతో భారత్-పాక్ సరిహద్దుల్లో రాజస్తాన్, పంజాబ్, సియోల్‌కోట ప్రాంతాల్లో భారత బలగాలను అప్రమత్తం చేయాలని ఐబీ హెచ్చరించింది.
భారత్‌పై దాడికి పాల్పడేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు దిశానిర్థేశం చేయడానికి రెండురోజుల క్రితం అజర్ మసూద్‌ను రహస్యంగా విడుదల చేశారని ఐబీ పేర్కొంది. కాగా అజర్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా ఇటీవల అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలు పాక్‌పై ఒత్తిడి తీసుకురావడంతో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నామని అంతర్జాతీయ సమాజం ముందు చెబుతూనే పాక్ ఇలాంటి వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది.