పాకిస్తాన్ ప్రచార వీడియోలో పూనమ్ కౌర్ - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్ ప్రచార వీడియోలో పూనమ్ కౌర్

November 5, 2019

గురునానక్ 550 జయంతి సందర్భంగా భారతీయ సిక్కు యాత్రికుల కోసం కర్తార్ పూర్ కారిడార్‌ను పాకిస్థాన్ ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఈ నెల 9న అత్యంత అట్టహాసంగా ఈ కారిడార్‌ను పాక్ ప్రభుత్వం ప్రారంభిస్తోంది. పంజాబ్‌లోని గురుదాస్ పూర్‌లో ఉన్న డేరాబాబా నానక్ విగ్రహం నుంచి పాకిస్థాన్‌లోని కర్తార్ పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్ గురుద్వారా వరకు ఈ కారిడార్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఓ పాటను అధికారికంగా విడుదల చేసింది.భారతీయ సిక్కు యాత్రికులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు ఈ పాటలో సాహిత్యం ఉంది. మధ్యమధ్యలో సిక్కు ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేయడం కూడా ఉంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగంతో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. ‘హజ్ యాత్రకోసం వెళ్లే ముస్లింలు మదీనా చేరుకోవడానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు వారి ముఖాల్లో కనిపించే ఆనందం నాకు ఇవాళ పంజాబీల ముఖాల్లో కనిపిస్తోంది’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించడంతో పాట ప్రారంభం అవుతుంది.

ఇందులో కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దూ, శిరోమణి అకాళీదల్ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్‌లతో పాటు, సినీనటి పూనం కౌర్ కూడా ఉన్నారు. పాక్ నిర్ణయంపై పూనం హర్షం వ్యక్తంచేశారు. పాక్ తమకు సాదరంగా ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని పలువురు అభిప్రాయాలు వ్యక్తంచేశారు.