తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పొరుగుదేశం పాకిస్తాన్కు బయటి నుంచి కూడా సాయం అందడం లేదు. ఉగ్రవాదానికి ఊతమిస్తోందనే కారణంతో అమెరికా సహా పలు దేశాలు సాయానికి కోత వేశాయి. నిత్యావసరాలు కూడా సరిగ్గా దొరక్క అల్లాడుతున్న పాక్ కాస్తంత ఉపశమనం కోసం రష్యా ముందు చేయి చాచి భంగపడింది. భారత్కు అమ్ముతున్నట్లే తమకూ 30 నుంచి 40 శాతం డిస్కౌంటుతో చమురు అమ్మాలని కోరగా రష్యా సాధ్యం కాదని తేల్చేసింది. దీంతో రాయితో కోసం రష్యాకు వెళ్లిన పాక్ పెట్రోలియం మంత్రి ముసాదిక్ మాలిక్ వెనక్కి వచ్చేశాడు.
ఉక్రెయిన్, రష్యా యుద్ధ నేపథ్యంలో రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనకూడదని పలు పాశ్చాత్యదేశాలు ఆంక్షలు విధించాయి. చమురు నిల్వలు భారీగా ఉన్న రష్యా విధిలేక తన చిరకాల మిత్రదేశమైన భారత్కు చమురును తక్కువ ధరకే సరఫరా చేస్తోంది. ఇది గమనించిన పాకిస్తాన్ మంత్రి తమకూ రాయితీ కావాలని రష్యా అధికారులతో చర్చలు జరిపారు. అమెరికాతో పాకిస్తాన్ స్నేహం, ఉగ్రవాదానికి ఊతం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని రష్యా ఆయనకు మొండిచేయి చూపినట్లు తెలుస్తోంది.