ఉగ్రవాద దేశం పాకిస్తాన్ అంతర్జాతీయంగా మరోసారి నవ్వులపాలైంది. భూకంపం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న తుర్కియే (టర్కీ)కి మనదేశంతో పాటు ప్రపంచంలోని మెజారిటీ దేశాలు స్పందించి ఆపన్న హస్తం అందించాయి. ఆర్ధిక సాయంతో పాటు మందులు, ఇతర నిత్యావసర సరుకులు పంపి ఆదుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ కూడా స్పందించి తన వంతు సాయాన్ని తుర్కియేకి అందించింది.
అయితే పాక్ పంపిన సాయాన్ని చూసి తుర్కియే అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఖంగుతిన్నారు. 2022 జూన్‌లో పాకిస్తాన్‌ని వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఆ దెబ్బతో అక్కడ ఆహార పంటల దిగుబడి పడిపోయి ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. ఆ సమయంలో స్పందించిన తుర్కియే.. తన వంతుగా సహాయక సామాగ్రిని పంపింది. దాన్ని పాకిస్తాన్ బాధితులకు ఇవ్వకుండా రీప్యాక్ చేసి ఇప్పుడు భూకంపంతో అల్లాడుతున్న తుర్కియేకి పంపింది. పైగా పంపిన బాక్సులపై వివరాలు కూడా మార్చకుండా అలాగే ఉంచడం మరో విశేషం. పాత బాక్సులపై కొత్త ప్యాకింగ్ చేసి పాకిస్తాన్ అందిస్తున్న సాయం అని ముద్రించిందంట. ఆ ప్యాకింగ్‌ని విప్పి చూస్తే లోపల ‘వరద ప్రభావంతో బాధపడుతున్న పాకిస్తాన్‌కి తుర్కియే పంపిన సాయం’ అని యథావిధిగా రాసి ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. పైగా ఇదంతా పాక్ ప్రధాని షెహబాజ్ పర్యవేక్షణలోనే జరిగిందట
. ఈ విషయాన్ని తుర్కియే విదేశాంగ మంత్రి పాక్ విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లారట. ఈ ఘటనతో పాక్ పరువు మరోసారి పోయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా, భూకంపం వచ్చిన రెండ్రోజుల తర్వాత పాక్ ప్రధాని, విదేశాంగ మంత్రి తుర్కియే పర్యటన చేద్దామని ఆ దేశానికి కబురందించారు. కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీకు వీఐపీ హోదాలో మర్యాద చేయడం కుదరదని తుర్కియే అధికారులు తేల్చి చెప్పేశారు. దీంతో పర్యటన వాయిదా పడింది. అయితే ఇది జరిగిన రెండ్రోజుల తర్వాత ఖతార్ అధ్యక్షుడు పర్యటించినప్పుడు తుర్కియే ఘన స్వాగతం పలికింది. దాంతో పాటు ఆ దేశం నుంచి పెద్ద ఎత్తున నగదు, ఇతర వస్తు సాయం పొందడం గమనార్హం. అటు భూకంపాల ద్వారా మరణించిన వారి సంఖ్య 45 వేలు దాటింది. ఇప్పటికీ శిథిలాల కింద నుంచి మృతదేహాలతో పాటు మొండిగా ప్రాణాలు నిలబెట్టుకుని బతికున్న మనుషుల ఉదంతాలు బయటపడుతున్నాయి.