Pakistan set up cyber army against India with Turkey's help: Report
mictv telugu

బుద్ధి మార్చుకోని పాకిస్థాన్.. టర్కీతో కలిసి భారత్‌పై దాడులకు ప్లాన్

October 28, 2022

దాయాది దేశమైన పాకిస్థాన్ ఎప్పటికప్పుడు భారత్‌పై తన కుటిల బుద్దిని ప్రదర్శిస్తూనే ఉంది. భారత్ ఎంత సంయమనం పాటిస్తున్నా.. ఏదొ ఒక రూపంలో రెచ్చగొడుతూనే ఉంది. అదేసమయంలో భారత్‌పై దాడికి దొంగదారులు వెతుకుతూనే ఉంది. తాజాగా.. ఇండియాపై దాడులు చేసేందుకు.. టర్కీ దేశంతో కలసి `సైబర్ ఆర్మీని` ఏర్పాటు చేసినట్లు నార్డిక్ మానిటర్ అనే వార్తా సంస్థ వెల్లడించింది. ఇండియా, అమెరికా దేశాలపై దాడుల కోసం సైబర్ ఆర్మీ ని ఏర్పాటు చేసిందని తెలిపింది. పాకిస్తాన్ చేసిన కుట్రకు టర్కీ రహస్యంగా సాయం చేసిందని పేర్కొంది.

2018లోనే అప్పటి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ హయాంలో ఈ దాడికి ప్లాన్ చేసినట్లు తెలిసింది. టర్కీ హోంమంత్రి సులేమాన్‌ సోయ్‌ పాకిస్థాన్‌ పర్యటనకు వచ్చినప్పుడు నాటి పాక్‌ హోంమంత్రి షెహరియార్‌ ఖాన్‌ అఫ్రిదీతో జరిపిన సమావేశంలో ఈ ప్రతిపాదన తొలిసారిగా చర్చకు వచ్చింది. పాకిస్థాన్‌ పాలకులపై వచ్చిన విమర్శలను సైతం టర్కీ తొక్కిపెట్టి సైబర్‌ నేరాలకు వ్యతిరేకంగా సహకారం పేరిట ద్వైపాక్షిక ఒప్పందం ముసుగులో ఆ పని రహస్యంగా చేసిందని నార్డిక్‌ మానిటర్‌ నివేదిక తెలిపింది. తమ దేశాధ్యక్షుడు రిసెప్ తైపీ ఎర్డోగాన్ తరఫున టర్కీ మంత్రి సులేమాన్ సైబర్ స్పేస్ లో బాట్ ఆర్మీని నిర్వహించాడని.. ముఖ్యంగా ఇండియా, అమెరికా దేశాలను టార్గెట్ చేశాడని పేర్కొంది.

పాకిస్థాన్‌లో దేశీయంగా రాజకీయ లక్ష్యాల కోసం, అలాగే అమెరికా, భారత్‌పై దాడుల కోసం సైబర్‌ ఆర్మీని ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. అత్యున్నత స్థాయిలో జరిగిన ఈ చర్చలను పాక్‌ హోంశాఖలో అధికారులకు సైతం తెలియకుండా రహస్యంగా ఉంచారని వెల్లడించింది. ఈ నెల 13న టర్కీలో ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని సులేమాన్‌ బయటపెట్టారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్‌ తరపున ట్రోల్‌, బాట్‌ ఆర్మీలను సులేమాన్‌ నిర్వహిస్తాడని పేరుంది. ఎర్డొగాన్‌ పార్టీ ఏకేపీ చేతిలో శక్తివంతమైన సోషల్‌మీడియా ఆర్మీ ఉంది. ఈ బృందంలో సుమారు 6,000 మంది ఉంటారని సమాచారం. మొత్తం మీద ఈ సైబర్ ఎటాక్ ప్లాన్‌పై అమెరికా, భారత్ ఏ విధంగా స్పందించనున్నాయి.. పాకిస్థాన్, టర్కీ ఎలాంటి వివరణ ఇవ్వనున్నాయి.. అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.