బాగానే అప్‌డేట్‌ అయ్యారు.. కరోనా రోగితో సెల్ఫీ దిగి..  - MicTv.in - Telugu News
mictv telugu

బాగానే అప్‌డేట్‌ అయ్యారు.. కరోనా రోగితో సెల్ఫీ దిగి.. 

March 24, 2020

bc bhb

సెల్ఫీ మాయరోగం మరో పరాకాష్టకు చేరింది. హాట్ ఇష్యూ మీద అప్‌డేట్ అయ్యారు సెల్ఫీగాళ్లు. ఏకంగా కరోనా రోగితో సెల్ఫీ దిగి విస్మయానికి గురిచేస్తున్నారు.  కొవిడ్-19ను అదుపు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాలు పోరాడుతున్నాయి. ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్న చందంగా తయారయ్యారు కొందరు. అసలే అది అంటువ్యాధి.. ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుందని ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా వినకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా పాకిస్థాన్‌లో కరోనా సోకిన వ్యక్తితో ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులు సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా ట్రెండింగ్ అయిపోయింది. ఆ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతుంటే.. ప్రభుత్వ ఉద్యోగులై ఇదేం పని?’ అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. మీరు కరోనా వచ్చి పోతారు అని మరికొందరు శాపనార్థాలు పెడుతున్నారు. ఈ విషయం కాస్తా ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో.. వారందరినీ ఉద్యోగాల నుంచి ఊడబీకి.. క్వారంటైన్‌కు తరలించింది. ఈ ఫొటోను సింధ్ ప్రొవిన్స్‌లోని సిక్కుర్‌లో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌లో దిగినట్టు అధికారులు గుర్తించారు.

ఈ సెల్ఫీపై సుక్కుర్ కమిషనర్ రానా అదీల్ మాట్లాడుతూ.. ‘ఉద్యోగులు అందరూ ప్రొవిన్షియల్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. వారిని క్వారంటైన్‌కు పంపాం. ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. కాగా, పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 892 కరోనా కేసులు నమోదు అవ్వగా.. 399 కేసులు సింధ్ ప్రొవిన్స్‌లోనే నమోదు అయ్యాయి. ఆరుగురు కరోనాతో మరణించారు. ఇప్పటికే సింధ్ ప్రొవిన్స్‌లో లాక్‌డౌన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.