భారతీయుల గురించి పాకిస్తాన్ నటి, మోడల్ సనమ్ సయీద్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ గురించి భారతీయులకు ఏమీ తెలియదని కామెంట్ చేసింది. తమకు మాత్రం బాలీవుడ్, భారతీయ కల్చర్ వంటివి అన్నీ తెలుసని అభిప్రాయపడింది. ఓ వార్తాసంస్థతో మాట్లాడిన ఆమె.. ‘వ్యక్తిగతంగా నేను హాలీవుడ్ సినిమాలు చూస్తాను. కానీ పాకిస్తాన్ మొత్తం బాలీవుడ్ సినిమా చూస్తుంది. మా ముత్తాతల నుంచి నేటి తరం వరకు అందరికీ మధుబాల, కరీనా కపూర్, దీపికా పదుకొనే, షారూఖ్, సల్మాన్, అమీర్ ఖాన్లు, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా వంటి నటులు తెలుసు.
పాటలు, డ్యాన్సులు, తినే విధానం, సంస్కృతి, పూజలు, అవి చేసే పద్ధతులు అన్నీ తెలుసు. మేమంతా బాలీవుడ్ ని తింటూ, తాగుతూ పెరిగాము. దీని వల్ల భారత్ లో ఏం జరుగుతుందో పాకిస్తానీయులు సులభంగా గ్రహించగలరు. అదే సమయంలో పాకిస్తాన్ లో ఏం జరుగుతుందో భారతీయులకు తెలియదు’ అని సయీద్ చెప్పింది. దీనిపై కొందరు నిజమేనంటూ కామెంట్లు చేస్తున్నారు. పాకిస్తాన్ లో ఎంతసేపు ఉగ్రవాదం తప్ప ఇంకేం ఉందని నిలదీస్తున్నారు. ఓ కల్చర్ అంటూ ఉంటే దేశం ఇలా పాడైపోయి ఉందేది కాదని చెప్తున్నారు. కేవలం మత విద్వేషం మీద ఏర్పడ్డ దేశం ఎంతో కాలం మనుగడ సాగించలేదని తేల్చి చెప్తున్నారు. దీనికి ఉదాహరణగా, ఇటీవల ఆ దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను చూపిస్తున్నారు.