ముంబై రాష్ట్రంలో 2008లో జరిగిన ఉగ్రదాడులకు సంబంధించి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో ప్రధాన హ్యాండ్లర్ (నిర్వాహకుడు)కు 15 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ, ఆదేశాలు జారీ చేసింది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులతో సంబంధం ఉన్న ఓ సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ.. ”నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన సాజిద్ మజీద్ మిర్ (40)కు ఈ నెల మొదట్లోనే లాహోర్‌లోని యాంటీ టెర్రరిస్ట్ కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇలాంటి కేసుల్లో నిందితుల నేరాన్ని మీడియాకు వెల్లడించే పంజాబ్ పోలీస్‌కి చెందిన కౌంటర్ టెర్రరిజం విభాగం ఈ విషయంలో పెదవి విప్పలేదు. మీర్‌కు కోర్టు శిక్ష విధించిన విషయాన్ని వెల్లడించలేదు” అని ఆయన అన్నారు.
ముంబైలో 2008లో దాడులు జరగడానికి ముందే మిర్.. 2005లో నకిలీ పాస్‌పోర్టును ఉపయోగించి భారత్‌కు వచ్చాడు. అతడిని అప్పట్లో ‘ప్రాజెక్టు మేనేజర్’ అని పిలిచేవారు. ముంబైలో దాడులు జరిపిన మిర్..ఆ దాడుల్లోనే మృతి చెందాడని తొలుత అధికారులు భావించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మిర్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. ముంబై దాడుల్లో మిర్ ప్రధాన పాత్రుడుగా తెలడంతో కోర్టు మిర్‌కు 15 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 4 లక్షల జరిమానాను విధించింది. ప్రస్తుతం మిర్ కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్నాడు.
2008లో జరిగిన ముంబై దాడుల్లో మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. మిర్ తలపై 5 మిలియన్ డాలర్ల నజరానా కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారత మోస్ట్ వాంటెడ్ జాబితాలో మిర్ కూడా ఉన్నాడు. మరోపక్క, ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు లాహోర్ యాంటీ టెర్రర్ కోర్టు ఇప్పటికే ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో 68 ఏళ్ల జైలు శిక్ష విధించింది.