ఖజానాలోని నెక్లెస్‌ను అమ్మేసిన ఇమ్రాన్ ఖాన్! దర్యాప్తు ప్రారంభం - MicTv.in - Telugu News
mictv telugu

ఖజానాలోని నెక్లెస్‌ను అమ్మేసిన ఇమ్రాన్ ఖాన్! దర్యాప్తు ప్రారంభం

April 13, 2022

amir

పాకిస్తాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఇమ్రాన్ ఖాన్‌కు కష్టాలు మొదలయ్యాయి. అనేక వివాదాలు ఆయనను చుట్టుముడుతున్నాయి. తాజాగా ఇమ్రాన్ పదవిలో ఉండగా బహుమతిగా స్వీకరించిన నెక్లెస్‌ను దేశ ఖజానాలో జమ చేయకుండా బయట మార్కెట్‌లో అమ్ముకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాహోర్‌లోని ఓ ప్రముఖ బంగారు దుకాణదారుడికి రూ. 18 కోట్లకు అమ్ముకున్నారని స్థానిక పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అంతేకాక, ఈ ఉదంతంపై పాకిస్తాన్ అత్యున్నత విచారణ సంస్థ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించిందని వెల్లడించింది. నిజానికి ప్రభుత్వ నేతగా ఉన్నప్పుడు వచ్చిన బహుమతులను ప్రధాని తన సహాయకుల వద్ద ఉంచవచ్చు. అయితే ఆ వస్తువు ధరలో సగం సొమ్ము పాకిస్తాన్ ఖజానాలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన నెక్లెస్ ఖరీదు రూ. 18 కోట్లు అయితే, అందులో సగం సొమ్ము రూ. 9 కోట్లను డిపాజిట్ చేయాలి. కానీ, ఈ నిబంధనలను పాటించకుండా కేవలం వందల రూపాయలను మాత్రమే జమ చేశారని పత్రిక పేర్కొంది. అంటే నెక్లెస్ విలువను తగ్గించి చూపి బహిరంగ మార్కెటులో వాస్తవ ధరకు అమ్ముకున్నారు. కాగా, భారీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్‌పై మున్ముందు ఎలాంటి ఆరోపణలు వస్తాయో చూడాలి.