Pakistani journalist reporting on deadly floods while neck-deep in water goes viral
mictv telugu

రిపోర్టింగ్ సరే, నువ్వు పోతే ఎలా ? ఓన్లీ తలకాయతో రిపోర్టింగ్..

August 30, 2022


పాకిస్తాన్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. వరదల ధాటికి వేలాదిమంది మృతి చెందారు. లక్ష్లలాదిమంది నిరాశ్రయులయ్యారు. రహదారులు, వంతెనలు, రైల్వే మార్గం పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో పాకిస్తాన్‌ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించడమే కాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లోకి ఆర్మీని పంపించి సహాయక చర్యలు చేపట్టింది. మరోవైపు వరదలతో అల్లకల్లోలంగా ఉన్న పాకిస్తాన్‌ ప్రాంతాల్లో పరిస్థితులు గురించి సమాచారాన్ని అందించే పనిలో పడ్డాయి అక్కడ మీడియా సంస్థలు. ఈ క్రమంలో.. దేశంలోని వరదల పరిస్థితిని రిపోర్ట్ చేసేందుకు ఓ టీవీ జ‌ర్నలిస్టు మెడలోతు నీటిలో దిగి రిపోర్టింగ్‌ చేస్తున్నాడు. అతడి శరీరం మొత్తం నీటిలో మునిగి ఉంది. తల, మైక్ మాత్రమే వీడియోలో కనిపిస్తున్నాయి.

లైవ్‌ రిపోర్టింగ్‌ని అందించడానికి సదరు రిపోర్టర్‌ పెద్ద సాహసమే చేశాడు. ఏకంగా వరద ఉధృతిలో… పీకల్లోతు నీటిలో నిలబడి మరీ అక్కడ పరిస్థితి గురించి సమాచారం అందించాడు. దీంతో నెటిజన్లు ఆ జర్నలిస్ట్‌ డెడికేషన్‌ వర్క్‌కి హ్యాట్సాప్‌ అని ప్రశంసిస్తే, మరికొందరూ టీఆర్పీ రేటింగ్స్‌ కోసం కొన్ని మీడియా సంస్థలు జర్నలిస్ట్‌లు చేత ఇలాంటి ప్రమాదకరమైన రిపోర్టింగ్‌లు చేయిస్తున్నాయంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ‘అనురాగ్ అమితాబ్’ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు.