Pakistani man praises PM Modi's leadership
mictv telugu

అల్లా.. మోదీని మాకివ్వండి దేశాన్ని బాగు చేస్తాడు.. వీడియో వైరల్

February 23, 2023

Pakistani man praises PM Modi's leadership

బీజేపీ పార్టీకి, ప్రధాని మోదీ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే వార్త ఇది. అర్ధరాత్రి సైతం పేరెంట్స్ పిల్లల ఆకలి తీర్చేలా భారత్‌ని తీర్చిదిద్దిన మోదీని మాకివ్వమని ఓ పాకిస్తానీ యువకుడు చెప్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘మోదీ చేసిన కృషి వల్ల భారతీయులు అందుబాటు ధరల్లో నిత్యావసరాలు కొనుక్కుంటున్నారు. మనకు అలాంటి పరిస్థితి లేనప్పుడే పుట్టిన దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తామ’ని చెప్పిన మాటను పార్టీ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. మాజీ జర్నలిస్ట్, యూట్యూబర్ అయిన సనా అంజాద్ దేశంలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ‘బతికేందుకు దేశం నుంచి పారిపోండి.

అది భారత్‌లో ఆశ్రయం పొందైనా సరే’ కార్యక్రమంలో భాగంగా వీధుల్లో తిరుగుతూ పౌరుల స్పందన కోరారు. ఈ క్రమంలో యువకుడు చెప్పిన మాటలు సంచలనంగా మారాయి. ‘పాకిస్తాన్ భారత్ నుంచి విడిపోవాల్సింది కాదు. అంతా కలిసి ఉంటే అందుబాటు ధరల్లో సరుకులు కొనేవాళ్లం. చెప్పుకోవడానికే మనది ఇస్లాం దేశం. కానీ ఇస్లాం ఇక్కడ పుట్టలేదు. భారత్ ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉంది. మరి మనం ఎక్కడ ఉన్నాం? గతంలో మాదిరి ప్రస్తుతం భారత్‌తో కనీసం పోలిక చేసుకోలేం.

మనకన్నా మోదీ ఎంతో నయం. ఆయనకు అక్కడ ఎంతో గౌరవం ఉంది. అలాంటి వ్యక్తి ఒక్కడు చాలు దేశంలోని సమస్యలను చక్కబెట్టడానికి. మోదీ ఉంటే మనకు ఏ నవాజ్ షరీఫ్‌లు, బేనజీర్ భుట్టోలు, ఇమ్రాన్ ఖాన్లు, ముషారఫ్లు అవసరమయ్యేవారు కాదు. అల్లా మోదీని మాకివ్వండి. దేశాన్ని బాగు చేస్తాడు’ అంటూ ఆవేదనగా మాట్లాడాడు. కాగా, ఇమ్రాన్ హయాంలో మొదలైన సంక్షోభం తర్వాత మరింత ముదిరింది. ఆదాయం కోసం ప్రభుత్వం విపరీతంగా పన్నులు పెంచడంతో ప్రజాగ్రహం తీవ్రంగా ఉంది.