అన్నలా, రాక్షసులా? చెల్లెలు మోడలింగ్ చేస్తోందని చంపేసిన అన్న.. - MicTv.in - Telugu News
mictv telugu

అన్నలా, రాక్షసులా? చెల్లెలు మోడలింగ్ చేస్తోందని చంపేసిన అన్న..

May 7, 2022

పరువు, మర్యాద పేర్లతో కుటుంబ సభ్యులపై దారుణాలకు తెగబడతున్నారు కొందరు వ్యక్తులు. తన సోదరి మరో మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కక్ష్యతో ఆ యువకుడిని నడిరోడ్డుపై పొడిచి చంపాడు ఆమె అన్న. తోబుట్టువు వద్దని వారించినా.. కాళ్ల మీద పడి బతిమాలాడినా ఆమెను కనికరించలేదు. ఆఖరికి సొంత అన్నే ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపాడు. హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పీఎస్ పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది.

అయితే తాజాగా అలాంటి సంఘటనే పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగింది. లాహోర్‌కు సమీపంలోని రెనలా ఖుర్దా ఒకారాకు చెందిన సిద్రా(21) అనే యువతిని ఆమె సోదరుడు తుపాకీతో కాల్చి చంపాడు. అందుకు కారణం.. ఆమె ఓ స్థానిక క్లాతింగ్‌ బ్రాండ్‌కు మోడలింగ్‌గా, ఫైసలాబాద్‌ నగరంలోని థియేటర్స్‌లో డ్యాన్సర్‌గా పని చేయడమే.
కుటుంబ సభ్యులతో రంజాన్ వేడుకలు జరుపుకొనేందుకు స్వగ్రామానికి వచ్చిన ఆమెను.. మోడలింగ్ తమ సంప్రదాయం కాదని, ఆ ఉద్యోగాన్ని మానేయాలంటూ తల్లిదండ్రులు, సోదరుడు ఒత్తిడి చేశారు. అయితే ఆమె తన కెరీర్‌ను వదులుకోనని తేల్చి చెప్పడంతో సోదరుడు హమ్జా ఆమెను కొట్టి, అంతటితో ఆగక ఆ మరుసటి రోజు కోపంతో ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. యువతి సోదరుడిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడు నేరం అంగీకరించడంతో అరెస్టు చేసినట్టు చెప్పారు.