యూపీలోని రామాలయాన్ని అమ్మేసిన పాకిస్తానీ.. నమ్మలేని నిజాలు - MicTv.in - Telugu News
mictv telugu

యూపీలోని రామాలయాన్ని అమ్మేసిన పాకిస్తానీ.. నమ్మలేని నిజాలు

May 19, 2022

యూపీలోని కాన్పూర్‌లో ఉన్న రాముడి గుడిని ఓ పాకిస్తానీ అమ్మేశాడు. కొన్న వ్యక్తి అక్కడ నివాసం ఉంటున్న హిందువలను వెళ్లగొట్టి ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడు. యూపీలో చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటన గురించి వివరాలు ఇలా ఉన్నాయి. అబిద్ రెహ్మాన్ అనే వ్యక్తి 1962లో పాకిస్తాన్‌కు వెళ్లిపోయాడు. తర్వాత తన ఆస్తులను విక్రయించాలనే ఉద్దేశంతో 1982లో తిరిగి ఇండియాకు వచ్చి బెకాన్ గంజ్‌లోని తన ఆస్తిని సమీపంలో సైకిల్ షాప్ నిర్వహించే ముఖ్తార్ బాబాకు అమ్మేశాడు. తర్వాత ముఖ్తార్ బాబా తాను కొన్న ఆస్తిలో ఉన్న రామాలయంతో పాటు పక్కన నివాసం ఉంటున్న 18 హిందూ కుటుంబాలను వెళ్లగొట్టి హోటల్ కట్టాడు.

కానీ, కాన్పూర్ మున్సిపల్ రికార్డుల ప్రకారం ఆ స్థలంలో రాముడి గుడి ఉన్నట్టు ఇప్పటికీ ఉంది. దీంతో శత్రు దేశాల వ్యక్తులకు చెందిన ఆస్తుల కమిటీకి గతేడాది ఈ విషయంలో ఫిర్యాదు అందింది. అనంతరం విచారణ ప్రారంభమవగా, కమిటీ ఈ ఆస్తిని శత్రు దేశాల ఆస్తులుగా ప్రకటించి అటాచ్ చేశారు. అంతేకాక, ఆస్తిని కొన్న వ్యక్తి యొక్క వివరణ కోరుతూ నోటీసు జారీ చేశారు. కాగా, తన వద్ద ఉన్న ఆస్తి పత్రాలను అధికారులకు చూపిస్తానని, వారడిగే ప్రశ్నలకు తగిన సమాధానం ఇస్తానని ముఖ్తార్ బాబా చెప్తున్నాడు. నోట్ : దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన వ్యక్తుల ఆస్తులపై పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఉదాహరణకు ముంబైలో విభజనకు కారణమైన జిన్నా హౌస్‌ను మొమోరియల్‌గా మారుస్తామని విభజన అనంతరం పాకిస్తాన్ అడిగినా మన దేశం ఇవ్వలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కొద్ది సంవత్సరాల క్రితం ఇలాంటి ఆస్తులలో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది.