పాక్ దుశ్చర్య.. కశ్మీర్ కూలీల తల నరికి! - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ దుశ్చర్య.. కశ్మీర్ కూలీల తల నరికి!

January 12, 2020

Pakistan

పాకిస్తాన్‌ మరో దుశ్చర్యకు పాల్పడింది. పూంచ్‌ జిల్లాలోని సరిహద్దు రేఖ సమీపంలో పీబీఏటీ (పాకిస్థాన్‌ బోర్డర్‌ యాక్షన్‌ టీం) ఇద్దరు కశ్మీరీ కూలీలను హతమార్చినట్లు భారత ఆర్మీ అనుమానిస్తోంది. మృతులను అత్యంత పాశవికంగా హతమార్చారని.. ఒకరి తల, మొండెం వేరుచేసినట్లు భారత ఆర్మీ అధికారులు ఇవాళ జమ్మూలో వెల్లడించారు. శుక్రవారం నాడు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వారు తెలిపారు. మోర్టార్లతో సైన్యం దాడికి దిగగా.. ఈ ఘటనలో అస్లాం(28), హుస్సేన్(23) ఇద్దరూ మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలు అయ్యాయని ఆర్మీ అధికారి తెలిపారు. అస్లాం దేహం పూర్తిగా ఛిద్రమై ఉందని, సంఘటనా స్థలంలో అతడి తల కనిపించలేదని చెప్పారు. 

మృతులు గుల్పూర్‌ సెక్టార్లోని కస్సాలియన్‌ గ్రామానికి చెందిన వారని అన్నారు. అస్లాం తలను బ్యాట్‌ బృందమే తీసుకుని వెళ్లిపోయి ఉంటుందని భారత్‌ ఆర్మీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కేసు విచారణ నిమిత్తం కూలీల మృతదేహాలను భారత్‌ ఆర్మీ స్థానిక పోలీసులకు అప్పగించింది. ఈ ఘటనపై ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎమ్‌.ఎమ్. నరవణె మాట్లాడుతూ.. ‘ఇలాంటి అనాగరిక చర్యలకు నిజమైన సైన్యాలు ఎప్పటికీ పాల్పడవు. సైన్యాలు నియమ నిబంధనల ప్రకారం నడుచుకుంటాయి. పాక్ దుశ్చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.