పాకిస్తాన్‌లో హింసాకాండ.. ఇమ్రాన్ అనుచరుల అల్లర్లు - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్‌లో హింసాకాండ.. ఇమ్రాన్ అనుచరుల అల్లర్లు

May 26, 2022

పీకల్లోతు రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్‌ అల్లర్లతో అట్టుడుకుతోంది. శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. వెంటనే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపుతో పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు భారీ సంఖ్యలో రోడ్లుపైకి వచ్చి విధ్వంసకాండకు తెగబడ్డారు. పోలీసులతో జరిగిన అల్లర్లలో ఒకరు చనిపోగా, వందల మంది గాయపడ్డారు.

ప్రభుత్వాన్ని గద్దె దించి, కొత్తగా ఎన్నికలకు సిద్ధం కావాలన్న ఇమ్రాన్ పిలుపుతో దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ‘శాంతియుత’ ర్యాలీ అశాంతికి ఆజ్యం పోసింది. పీటీఐ కార్యకర్తలు ఓ మెట్రో స్టేషన్‌కు, పలు వాహనాలకు నిప్పటించారు. నగరంలో పలుచోట్ల పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య హింస జరిగింది. అటు పాక్ పంజాబ్ రాష్ట్రంలోనూ అల్లర్లు చెలరేగాయి. చైనా చౌక్‌ మెట్రోస్టేషన్‌కు, అక్కడున్న చెట్లకు నిప్పంటించారు. కాగా ఇమ్రాన్ నిర్వహించే ర్యాలీల్లో ఎవరూ పాల్గొనొద్దని, అతనికి ఎలా బుద్ధి చెప్పాలో తమకు తెలుసని ప్రధాని షాబాజ్ షరీఫ్ హెచ్చరించారు.