బాలాకోట్‌ శవాలపై భారత్, పాకిస్తాన్ వాదనలు సరే, ఇటలీ జర్నలిస్టు చెబుతున్న కొత్త సంగతి ఇదీ! - MicTv.in - Telugu News
mictv telugu

బాలాకోట్‌ శవాలపై భారత్, పాకిస్తాన్ వాదనలు సరే, ఇటలీ జర్నలిస్టు చెబుతున్న కొత్త సంగతి ఇదీ!

May 8, 2019

పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందని అంటారు. ఇద్దరు తగవులాడుకోవడం వల్ల మూడోవాడు లబ్ధి పొందడం అన్నమాట. కానీ అన్ని పంచాయితీలు అలా ఉండవు. వాటాల లెక్కలు కాకపోయినా అప్పుడప్పుడూ ఇద్దరి మధ్య జరిగే గొడవలో మూడోవాడు దూరి బ్యాలన్స్ చేస్తుంటాడు. ఐక్యరాజ్యసమితి, మధ్యవర్తిత్వ కోర్టులు వంటివాటిని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఆ వాటి తీర్పులు అంత కచ్చితంగా ఉంటాయని చెప్పలేం.

Pakistan's cover up exposed in new report: 130-170 JeM terrorists killed in Balakot airstrike

ఎవరి లెక్కలు ఏంటి?

బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై భీకరంగా వైమానిక దాడులు చేసి 300 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామని భారత సైన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దాడుల్లో ఒక్కడూ చావలేదని, రెండు చెట్లు మాత్రం కాలిపోయాయని పాకిస్తాన్ వెటకరించింది. కాదు, 300 మంది చచ్చారని, దాడుల సమయంలో అక్కడ 300  ఫోన్ సిమ్ములు యాక్టివేషన్‌లో ఉన్నాయని భారత్ చెప్పింది. పాకిస్తాన్ ఆ వాదనను పట్టించుకోలేదు. భారత్ మరింత గట్టి ఆధారాలు చూపాలంటోంది. అప్పటికి బాలాకోట్ ఏదో భారత్ భూభాగంలో ఉన్నట్టు! ‘మేం చంపేశాం లెక్కెట్టుకోవాల్సింది మీరే’ అని భారత్ చెబుతోంది. దాడిలో ఉగ్రనష్టంపై సందేహాలు లేవదీస్తున్న కాంగ్రెస్‌ను దేశద్రోహి అని తిడుతూ, రాహుల్ కూడా పాక్ వెళ్లి ఆ శవాలను లెక్కెట్టుకోవాలని అంటున్నారు బీజేపీ నేతలు. ఈ పంచాయితీ మూడు నెలలుగా సాగుతోంది. దీన్ని తాను తీరుస్తానంటూ ఇటాలియన్ పాత్రికేయురాలు ఫ్రాన్సెస్కా మారినో ముందుకొచ్చింది. భారత్ దాడులు పక్కాగా జరిపిందని, 170 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు మట్టికరిచారని ఆవిడ చెబుతోంది.

కొత్త డేటా..

‘ఫిబ్రవరి 26వ తేదీ తెల్లవారుజామున జరిగిన దాడులపై సమాచారాన్ని పాక్ దాచిపెడుతోంది. దాడి తర్వాత పాక్ ఆర్మీ యూనిట్ ఒకటి బాలాకోట్ ఉగ్ర శిబిరం వద్దకు చేరుకుంది. గాయపడిన 45 మందిని మిలిటరీ క్యాంపుకు తీసుకెళ్లింది. వారిలో 20 మంది చికిత్స పొందుతూ అక్కడే చనిపోయారు. వీరిలో 11 మంది ఉగ్రశిక్షకులు ఉన్నారు. బాంబులు తయారీ, తుపాకీ పేల్చడం వంటి వాటిలో వీరు శిక్షణ ఇస్తుండేవారు. జైషే నాయకులు ఉగ్రస్థావరానికి చేరుకుని మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చారు. దాడుల వివరాలను బయటి ప్రపంచానికి చెప్పకుండా కొంతమంది స్థానికులకు డబ్బులు కూడా పంచారు. ప్రస్తుతం ఆ శిబిరం పాక్ ఆర్మీ కమాండ్ చేతుల్లో ఉంది. జైషే కమాండర్ దాన్ని నిర్వహిస్తున్నాడు.. ’ అని మారినో వివరించింది.

మరి ఆమెకు ఈ వివరాలన్నీ ఎలా తెలిశాయి? ఇటీవల నిజనిర్ధారణ అంటూ పాక్ ఆర్మీ కొంత మంది విదేశీ జర్నలిస్టులను బాలాకోట్ తీసుకెళ్లింది. అయితే వారిలో మారినో లేదు. తనకు పాక్ ఆర్మీ నుంచి, ఉగ్ర శిబిరాల నుంచి, బాలాకోట్ ప్రాంతంలోని విలేకర్లు, ఇతర వ్యక్తులనుంచి ఈ సమాచారం అందిందని చెబుతోంది. మరి ఇందులో విశ్వసనీయత ఎంత? ఆమెకు అందిన లెక్కలు నిజమేనా? అంటే నిజమనే భావించాల్సి వస్తోంది.

ఎవరీ జర్నలిస్టు?

ఫ్రాన్సెస్కాకు పాకిస్తాన్ బాగా పరిచయం. ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి టెర్రర్ నేతలను ఆమె చాలాసార్లు ఇంటర్వ్యూ చేసింది. 2012లో జమాద్ ఉద్ దవా నాయకుడు, నరనరానా భారత్‌పై విషం నింపుకున్న ముష్కరుడు హఫీజ్ సయీద్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఆమెకు పాక్ ఆర్మీ ఈ ఇంటర్వ్యూల్లో సహకరించింది. ఇన్ని సోర్సులు ఉన్న మారినో బాలాకోట్‌పై బయటపెట్టిన సమాచారంలో చాలవరకు నిజం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.  పాకిస్తాన్ ఇంతవరకూ ఆమె లెక్కలను ఖండించకపోవడం చూస్తుంటే మౌనం అంగీకారం అన్నట్టే భావించాల్సి వస్తోంది. దాడుల సమయం నాటి వేడి వాతావరణం ఇప్పుడు లేదు. పైగా మీ గడ్డపై ఉగ్రనిర్మూలన చేయకపోతే డబ్బు సాయం చేసేది లేదని అమెరికా కూడా పట్టుదలతో ఉంది. దీంతో ప్రస్తుతానికి ఇలా నోరుమెదపకుండా పనికానిచ్చేస్తోంది పాక్!!