పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో తనను తాను గాడిదగా చెప్పుకున్నారు. తనతో గాడిదలా పని చేయించుకుంటున్నారని అభివర్ణించుకున్నారు. తమ దేశానికి సాయం కావాలంటూ వేడుకోవడానికి అమెరికాలో పర్యటిస్తున్న ఆయనను పాకిస్తాన్ జర్నలిస్టులు ప్రశ్నించారు. దేశం ఆర్ధిక సంక్షోభంలో ఉన్న వేళ విదేశీ పర్యటనలపై వస్తున్న విమర్శలకు మీ జవాబేంటని అడిగారు. దీనికి సమాధానమిస్తూ ‘నా ఖర్చును దేశం భరించట్లేదు. సొంతంగా ఖర్చు పెట్టుకుని పర్యటనలు చేస్తున్నాను. ఇవి నాకోసం కాదు. పర్యటనల వల్ల దేశానికి మేలు జరుగుతుంది.
బహుశా ఇలాంటి విదేశాంగ మంత్రిని ప్రపంచంలో ఒక్కడినే అనుకుంటా. చాలా కష్టపడుతున్నా. నాచేత గాడిదలా చాకిరీ చేయించుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. అటు భుట్లో అమెరికాలో అరెస్టయ్యారన్న వార్తలపై ఆ శాఖ అధికార ప్రతినిధి స్పందించారు. అవన్నీ అబద్ధాలనీ, స్పష్టం చేశారు. అధికార హోదాలోనే ఆయన అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని వెల్లడించారు.