Pakistan's victory over India..with one ball to spare
mictv telugu

భారత్‌పై పాక్ విజయం..మరో బంతి మిగిలుండగానే

September 5, 2022

ఆసియా కప్ సూపర్-4లో గతరాత్రి ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు నువ్వా, నేనా అన్నట్లు సాగింది. మ్యాచ్‌ను వీక్షించిన క్రికెట్ ప్రియులు విపరీతమైన టెన్షన్‌కు గురయ్యారు. మొదటగా భారత జట్టే గెలుస్తుందని ఆశలు చిగురించినప్పటికి, చివర ఓవర్‌లో ఒక బంతి మిగిలుండగానే భారత జట్టుపై పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం జరిగిన ఆసియా కప్ సూపర్- 4 పోరులో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు గెలుపొందగా, తాజా విజయంతో పాకిస్ధాన్ లెక్క సరి చేసింది. టాస్ ఓడిన భారత్.. మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 44 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి 60 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక, ఓపెనర్లు రోహిత్ శర్మ (28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (28; ఒక ఫోర్, 2 సిక్సర్లు) కొట్టి ప్రేక్షకులను ఆనందపరిచారు.

అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్ధాన్..19.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి 71 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మహమ్మద్ నవాజ్ (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక, భారత బౌలర్లలో భువనేశ్వర్, అర్న్‌దీప్, రవి బిష్ణోయ్, పాండ్యా, చాహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. నవాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. భారత్ తదుపరి మ్యాచ్ మంగళవారం శ్రీలంకతో జరగనుంది.