pakisthan Election Commission has imposed a five-year ban on Imran Khan
mictv telugu

ఇమ్రాన్‌ఖాన్‌పై ఐదేళ్ల నిషేధం.. ఎంత దరిద్రపు పని చేశాడంటే

October 21, 2022

పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌పై ఆ దేశ ఎన్నికల సంఘం ఐదేళ్ల నిషేధం విధించింది. నేషనల్ అసెంబ్లీ (మన పార్లమెంటు లాగా)కి పోటీ చేయడంపై అనర్హత వేటు వేసింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో 7 స్థానాల్లో పోటీ చేసి రికార్డు స్థాయిలో ఆరు స్థానాల్లో గెలుపొందిన ఇమ్రాన్‌కు తాజా పరిణామం షాక్‌కి గురి చేసింది. ప్రధానిగా ఉన్నప్పుడు వివిధ దేశాల నుంచి వచ్చిన కానుకలను బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకున్నారని ప్రధాన ఆరోపణ. ఈ విషయంపై ఇప్పటి ప్రభుత్వం కేసు వేయడంతో విచారించిన నలుగురు సభ్యుల బృందం నిషేధం వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ సికందర్ సుల్తానా రజా ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఆరోపణలను సెప్టెంబరులో ఇమ్రాన్ నిజమేనని ఒప్పుకున్నాడు. దేశ ఖజానాలో జమ చేయాల్సిన వస్తువులను రాయితీ మీద 21.56 మిలియన్ పాకిస్తానీ రూపాయలు చెల్లించి బహిరంగ మార్కెట్లో 58 మిలియన్ పాకిస్తానీ రూపాయలకు అమ్ముకున్నట్టు తెలిపాడు.

అందులో గ్రాఫ్ రిస్ట్ వాచ్, కఫ్ లింక్స్ పెయిర్, ఖరీదైన కలం, ఉంగరం, నాలుగు రోలెక్స్ గడియారాలు ఉన్నాయి. పాకిస్తాన్ నిబంధనల ప్రకారం 30 వేల పాకిస్తానీ రూపాయల విలువ కంటే తక్కువ ఉన్న వస్తువులను ప్రధాని తన వద్ద ఉంచుకోవచ్చు. ఏమైనా వస్తువు కావాలంటే 20 శాతం సబ్సీడీ ఇస్తారు. కానీ ఇమ్రాన్ దానిని 50 శాతం చేసి సొమ్ము చేసుకున్నాడు. ఈ ఆరోపణలపై విచారించిన ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఈ నిర్ణయంపై మండిపడిన ఆయన పార్టీ నేతలు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు. అంతేకాక, తీర్పును హైకోర్టులో సవాలు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, మన దేశ ప్రధానికి కూడా విదేశాల్లో అరుదైన, ఖరీదైన బహుమతులు వస్తుంటాయి. ఈ రకంగా మోదీకి వచ్చిన బహుమతులను బహిరంగ వేలం వేసి ఆ డబ్బును ప్రజాప్రయోజనాలకు వినియోగిస్తారు. రెండు దేశాలకు తేడా ఇదేనంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.