మోదీపై ఇమ్రాన్.. పెట్రోల్‌పై రూ. 25 తగ్గించారంటూ మెచ్చుకోలు - MicTv.in - Telugu News
mictv telugu

మోదీపై ఇమ్రాన్.. పెట్రోల్‌పై రూ. 25 తగ్గించారంటూ మెచ్చుకోలు

May 27, 2022

pakisthan ex PM imran khan praised narendra modi on petrol price

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీని మెచ్చుకున్నారు. స్వతంత్ర విదేశాంగ విధానంతో రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసి తన ప్రజలకు ఉపశమనం కలిగించారని అభినందించారు. ఒకవైపు క్యాడ్ సదస్సులో కీలక పాత్ర పోషిస్తూ, అమెరికా ఒత్తిళ్లను ఎదుర్కొంటూ కూడా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని అభిప్రాయపడ్డారు.

తక్కువ ధరకు వస్తుంది కాబట్టే భారత్‌లో ఇటీవల పెట్రోల్ ధరలు రూ. 25 (పాక్ కరెన్సీలో) తగ్గించారని వ్యాఖ్యానించారు. ఈ పని చేయడం పాకిస్తాన్‌కు చాత కావట్లేదని విమర్శించారు. ఐఎంఎఫ్ ఒత్తిళ్లకు తలొగ్గి పెట్రోల్‌పై సబ్సిడీలను తగ్గించి రూ. 30 లను పెంచారంటూ మండిపడ్డారు. తాను పదవిలో ఉండగా, రష్యా వెళ్లింది తక్కువ ధరకు చమురు కొనుగోలు చేయడం కోసమేనని వెల్లడించారు. మన దేశం కూడా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అవలంబించాలని, తద్వారా పాక్ ప్రయోజనాలను కాపాడుకోవాలని హితవు పలికారు.