pakisthan imposed new taxes on people
mictv telugu

పాక్‌లో ‘సూపర్ ట్యాక్స్’.. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తంటాలు

June 24, 2022

pakisthan imposed new taxes on people

శ్రీలంక వంటి దారుణ పరిస్థితులు రాకుండా నిరోధించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పలు రకాల పన్నులను విధిస్తోంది. ఇప్పటికే పెట్రోల్, విద్యుత్ ధరలను భారీగా పెంచగా, ఇప్పుడు కొత్తగా పరిశ్రమలపై పది శాతం సూపర్ ట్యాక్స్ విధించింది. సిమెంటు, ఉక్కు, వాహన తయారీ, టెక్స్‌టైల్స్, పంచదార, సిగరెట్టు, మద్యం, కెమికల్స్ వంటి భారీ వస్తువులు తయారుచేసే పరిశ్రమలు ఈ పన్నును కట్టాలని ఆదేశించింది. దీంతోపాటు సంపన్నులపై ‘పేదరిక నిర్మూలన’ పేరిట పన్ను విధిస్తున్నట్టు ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు.

దేశాన్ని దివాళా నుంచి కాపాడేందుకు పై నిర్ణయాలు తీసుకున్నామని, అందరూ సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. పాక్ రూపీ లెక్కల్లో వార్షికాదాయం 150 మిలియన్లు ఉంటే 1 శాతం, 200 మిలియన్లకు 2 శాతం, 250 మిలియన్లకు 3 శాతం, 300 మిలియన్లకు 4 శాతం కట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అటు తక్కువ స్థాయి వస్తువుల ఎగుమతి, పెరిగిన ధరలతో భారీగా పెరుగుతున్న దిగుమతులు ఆర్ధిక వ్యవస్థకు నష్టం చేకూర్చాయని, రూపీ విలువ దారుణంగా పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు. కాగా, ఐఎంఎఫ్ రుణం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న పాకిస్తాన్.. అది రాకపోతే మాత్రం దివాలా తీయడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.