Palvai Sravanti was declared by Congress as a candidate in munugodu by election
mictv telugu

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి ప్రకటన.. ఎవరంటే

September 9, 2022

తెలంగాణలో ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్ధిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దివంగత సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ముఖుల్ వాస్నిక్ శుక్రవారం ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ప్రతిపాదనల మేరకు ఈ ఎంపిక చేసినట్టు వెల్లడించారు. ఇద్దరు అభ్యర్ధులు పోటీ పడగా, చివరికి స్రవంతి వైపు అధిష్టానం మొగ్గు చూపినట్టు తెలిపారు. అటు బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉండగా, ఇప్పుడు కాంగ్రెస్ తరపున కూడా అభ్యర్ధి ఖరారయింది. కానీ, అధికార టీఆర్ఎస్ మాత్రం ఇప్పటివరకు అభ్యర్ధిని ప్రకటించలేదు. ఇప్పటికే అభ్యర్ధిని ప్రకటించిన రెండు పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తుండగా, అధికార పార్టీ అయి ఉండి వెనకబడి పోతున్నామన్న భావన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్నా చివరి క్షణంలో కొత్త అభ్యర్ధిని తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంచనా వేస్తున్నారు. బలమైన ఓటు బ్యాంకు ఉన్న కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చినప్పటికీ ఈ విషయంలో జాప్యం మంచిది కాదని స్థానికంగా చర్చించుకుంటున్నారు.