డబ్బు మానవ సంబంధాలను చెరిపేసిందని అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు నిరూపిస్తుంటాయి. కరెన్సీ కోసం సొంత బంధువులు, రక్త సంబంధీకులే దారుణాలకు పాల్పడుతుండడం నిత్యకృత్యమైంది. నగరంలోని పంజాగుట్టలో జరిగిన వ్యక్తి కిడ్నాప్ కేసులో ఇలాగే జరిగింది. బామ్మర్దులు బావ బతుకు కోరతారని చెప్తారు కానీ డబ్బుల కోసం బామ్మర్దే సొంత బావను కిడ్నాప్ చేయించి నాటకమాడాడు. అలా రూ. 30 లక్షలు దోచేసి చివరికి కటకటాల పాలయ్యాడు. పోలీసులు వెల్లడించిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అమీర్‌పేటకు చెందిన మురళీ కృష్ణ ఓవర్సీస్ జాబ్ కన్సల్టెన్సీ నడుపుతున్నాడు.
అతను జనవరి 27న లాల్ బంగ్లా సమీపంలో పిల్లలను స్కూళ్లో వదిలి వస్తుండగా, ఐదుగురు దుండగులు ఐటీ అధికారులమని చెప్పి విచారణ పేరుతో కిడ్నాప్ చేశారు. హైదరాబాద్ శివారు బాటసింగారం తీసుకెళ్లి ట్యాక్స్ కింద రూ. 60 లక్షలు కట్టాలని ఒత్తిడి చేశారు. అందుకు మురళీ ఒప్పుకోకపోవడంతో చేయిచేసుకొని నీ భార్యను, బావమరిదిని కూడా అరెస్ట్ చేసి జైళ్లో పెడతామని బెదిరించారు. దాంతో భయపడ్డ మురళీ తన భార్యకు ఫోన్ చేసి రూ.30 లక్షలు బావమరిది రాజేశ్‌కి ఇచ్చి పంపమని చెప్పగా, రాజేశ్ నుంచి డబ్బులు తీసుకున్న దుండగులు వారిని హయత్ నగర్ వద్ద దింపేసి పారిపోయారు. అనంతరం మురళీ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి అసలు సూత్రధారి బావమరిది రాజేశ్‌ను అరెస్ట్ చేశారు. డబ్బుల కోసమే బావను కిడ్నాప్ చేశానని ఒప్పుకోవడంతో రాజేశ్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 15 లక్షల నగదు, ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.