రాజకీయాల్లో ఎవరికి ఎవరు ఏమవుతారో… చివరకి ఎవరు ఏ దరికి చేరుతారో… ఈ మాటలు సరిగ్గా తమిళనాడు రాజకీయాలకు సూట్ అవుతాయి. అమ్మ బతికున్నప్పుడు రాజకీయం అంతా అమ్మ చుట్టూ తిరిగింది. నాయకులు పోటీలు పడి అమ్మ దర్శనం కోసం ప్రదక్షిణలు చేశారు. ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది. చిన్నమ్మ జైళ్ల ఉంది. దినకరన్ ఎపి సోడ్ చిన్నమ్మనే కాదు.. ఆమె ను నమ్ముకున్న వారినీ నిండా ముంచినంత పనిచేసింది. ఇక నాయకులు నావికుడు లేని నావలోకి ఎక్కినట్లు ఫీల్ అవుతున్నారట. అందుకే తమను ఆదుకునే నాథుని కోసం ఎదురు చూసి అంతా కల్సి హస్తిన వైపు అడుగులు వేస్తున్నారని తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతున్నది.
పన్నీర్ సెల్వం, చిన్నమ్మ వర్గాలుగా వీడిపోయిన నాయకులు ఇప్పుడు ఒక్క తాటి మీదకొస్తున్నారట. పన్నీర్, పళని స్వామిలిద్దరూ కల్సిపోయి కొత్త సమీకరణకు తెరసే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారట. బిజెపి అధినాయకులు వీరితో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ రోజు కాక పోతే ఇంకాస్త ఆలస్యం అయినా సరే కాని బిజెపి నాయకులను కలుపుకుని లేదా… తామే దాంట్లో కల్సి… లేకపోతే కల్సి పనిచేద్దామనే ఎజెండాను ప్రిపేర్ చేస్తున్నారట.
అందుకే పన్నీర్, పళని స్వామిలిద్దరూ కల్సి పోతున్నారట. చీలికలు పేలికలైన శిబిరాలన్ని ఇప్పుడు ఏకతారాగం ఆలపిస్తున్నాయి. అంతా కల్సి ఉంటేనే తిరిగి పవర్ లోకి వస్తామని భావిస్తున్నారట. ఏ మాత్రం ఆలస్యం చేసినా అమ్మ సెంటిమెంట్ ఇప్పటికే బాగా దెబ్బతిన్నది కాబట్టి దాన్ని మరింత డ్యామేజీ చేసుకోకుండా ఉన్న ఇమేజీని కాపాడుకోవాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారట.
అందుకే బిజెపితో ఉన్న పాత స్నేహ బంధాన్ని మరింత బలపర్చుకోవాలని అనుకుంటున్నారట. పన్నీర్, పళని స్వాముల మధ్య ఏకాభిప్రాయ రాక పోతే పార్టీని బిజెపిలో విలీనం చేద్దామనే చర్చ కూడా కొందరు నాయకులు తెరపైకి తెస్తున్నారట. నిజంగానే అంత పని జరుగుతుందా అనేది చూడాలి. అయితే పార్టీలోని మెజార్టీ నాయకులు విలీనం కంటే గతంలో మాదిరిగా కల్సి పనిచేయడమే బెటర్ ఆప్షన్ అంటున్నారట. పన్నీర్ వెంట ఇన్నాళ్లున్న నాయకులు సిఎం పళని స్వామి శిబిరంతో చర్చలు చేస్తున్నారట. ఇద్దరు నాయకులు కల్సి మీడియా మీట్ పెట్టి తమ పార్టీ భవిష్యత్తు ఏమిటో కూడా చెప్తారట.
వీళ్లు ఏం చేస్తారో… ఎట్లా ముందుకు వెళ్తారో తెలియదు కానీ పార్టీ పునాదులు ఇబ్బందుల్లో పడ్డాయనే చర్చ మాత్రం జనాల్లో బాగా జరుగుతున్నది. కొత్త రాజకీయ పార్టీ వస్తుందనే చర్చలూ జరుగుతున్నాయి. మరో వైపు రాష్ట్రంలో డిఎంకే బలం కూడా పెరుగుతున్నది. అక్కడ బలం లేనిది జాతీయ పార్టీలకు మాత్రమే. దీన్ని అదనుగా తీసుకుని బలపడాలని బిజెపి భావిస్తున్నది. జనం మూడ్ ఇప్పటికప్పుడే సరిగ్గా దొర్కకున్నా… ఇంటి పార్టీల వైపే ఉండే అవకాశాలున్నాయి. మరి ఏఐడిఎంకేలున్న పెద్ద నాయకులిద్దరు పన్నీర్ అండ్ పళని స్వామి పార్టీ భవిష్యత్తును… తమ భవిష్యత్తును ఎట్లా తీర్చి దిద్దుకుంటారో చూడాలి.