ఉత్తరాఖండ్ లోని రూర్కీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ కు మెరుగైన చికిత్స అందించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం చికిత్స పొందుతున్న డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ముంబైకి తరలించనున్నారు. ఐసీయూ నుంచి ప్రైవేట్ వార్డుకు వచ్చిన పంత్ ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాడు. వీపు, తలతో పాటు పంత్ కాలికి తీవ్ర గాయమైంది. వీటిలో మోకాలు లిగమెంట్ సమస్యను పూర్తి నయం చేసేందుకు ప్రత్యేక వైద్యం చేయించనున్నారు. పంత్ ముఖ గాయాలకు ప్రస్తుతం ప్లాస్టిక్ సర్జరీ జరిగింది. ఇంకా ఎంఆర్ఐ స్కాన్ ఇంకా పెండింగ్‌లో ఉంది. అవసరమైతే పంత్ ను విదేశాలకు కూడా పంపించి వైద్యం అందిస్తారని తెలుస్తోంది. పంత్ కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్యానల్ వైద్యులు పంత్ ఆరోగ్యపరిస్థితిపై నివేదిక ఇవ్వనున్నారు. దీని ఆధారంగా అవసరమైతే మెరుగైన చికిత్స కోసం అతడ్ని విదేశానికి తరలించే ఆలోచన చేస్తున్నట్టు, ముఖ్యంగా లండన్ కు తరలించొచ్చు అంటున్నారు. .
గతనెల 30న పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడి కారు పూర్తిగా దగ్థమైంది. అతడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ పంత్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత డెహ్రా డూన్లోని మ్యాక్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. పంత్ మైదానంలో దిగేందుకు సుమారు 5-6 నెలలు పట్టే అవకాశం ఉంది.