Home > Featured > బొప్పాయితో డెంగీ తగ్గుతుందా? డాక్టర్లు ఏమంటున్నారు

బొప్పాయితో డెంగీ తగ్గుతుందా? డాక్టర్లు ఏమంటున్నారు

papaya leaves to fight.

హైదరాబాద్ నగరాన్ని డెంగీ జ్వరం బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే నగరంలో డెంగీ బారిన పడి 50 మంది మృతి చెందారు. డెంగీ అనగానే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది ప్లేట్‌లెట్స్. వ్యాధి సంక్రమిస్తే రక్తంలో ప్లేట్‌లెట్స్ గణనీయంగా తగ్గిపోతాయి. బొప్పాయి ఆకుల రసం సేవిస్తే రక్తంలో ప్లేట్‌లెట్స్ గణనీయంగా పెరుగుతాయని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘కొన్ని బొప్పాయి ఆకుల‌ను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని మిక్సీలో వేసి దాంతోపాటు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీరు, ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం, చిటికెడు ప‌సుపుల‌ను కూడా వేయాలి. తరువాత అన్ని ప‌దార్థాల‌ను మిక్సీ ప‌ట్టాలి. అప్పుడు వ‌చ్చే ద్ర‌వాన్ని వ‌డ‌బోసి, దానికి కొంత తేనె క‌లిపి రోజు రెండు పూట‌లా డాక్ట‌ర్ ఇచ్చిన మెడిసిన్స్‌తో పాటు తీసుకోవాలి. దీంతో ప్లేట్‌లెట్స్ సంఖ్య వేగంగా పెరుగుతుంది. త్వ‌ర‌గా డెంగీ వ్యాధి నుంచి కోలుకుంటారు’… ఇది ఆ వార్త సారాంశం. ఈ వార్తను కొందరు ప్రజలు ధ్రువీకరిస్తుండగా.. మరికొందరు అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తపై డాక్టర్లు ఏమంటున్నారో తెలుసుకుందాం.

డెంగీ జ్వరంలో అసలు సమస్య ప్లేట్‌లెట్స్ తగ్గటం కాదని డాక్టర్లు అంటున్నారు. రక్త నాళాల్లోంచి ప్లాస్మా ద్రవం లీకై రక్తం చిక్కపడటం డెంగీ వలన కలిగే అసలు సమస్య అంటున్నారు. బొప్పాయి ఆకు రసంలో ఉన్న రసాయనాలు కొంతమేరకు ప్లేట్‌లెట్స్‌ను పెంచుతున్నట్టు కొన్ని పరిశోధనల్లో వెల్లడైనా అవి డెంగీ చికిత్సకు సరిపడేంత స్థాయిలో లేవన్నది గుర్తించాలంటున్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా కేంద్ర ప్రభుత్వం బొప్పాయి ఆకుల రసాన్ని డెంగీ వ్యాధి కోసం సిఫారసు చేయటం లేదంటున్నారు. బొప్పాయి పండ్లు, కివీ, జామ పండ్లు, కలబంద రసం వంటివీ డెంగీ తగ్గటానికి ఉపయోగపడవని డాక్టర్ల వాదన. వీటిపై ఆధారపడి చికిత్స తీసుకోకపోవటం సరికాదంటున్నారు. ప్లేట్‌లెట్స్ ఏమాత్రం తగ్గినా భయపడాల్సిన అవసరం లేదని, స్వంత వైద్యంపై ఆధారపడకుండా డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Updated : 11 Sep 2019 8:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top