అమెరికాలో విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో ప్యారాచూట్ ఫ్లయింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన సుప్రజ అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా మార్టూర్ మండలం చింతపల్లిపాడు గ్రామానికి చెందిన ఆలపర్తి శ్రీనివాసరావు(సుప్రజ భర్త) పదేళ్ల క్రితం కుటుంబంతో సహ అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. చికాగోలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న శ్రీనివాసరావు.. ఫ్లోరిడాకు మారారు. వీరికి అక్షత్ చౌదరి (10), శ్రీఅధిరా (6) పిల్లలు ఉన్నారు.
వేసవి సెలవులు కావడంతో అక్కడే స్థానికంగా ఉంటున్న తెలుగు కుటుంబాలతో కలిసి సుప్రజ కుటుంబం విహారయాత్రకు వెళ్లింది. విహారయాత్రలో భాగంగా బోటింగ్ చేస్తుండగా బోట్‌కు అనుసంధానించిన ప్యారాచూట్‌పై సుప్రజ, ఆమె కుమారుడు అక్షత్ విహరిస్తున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా ప్యారాచూట్ బ్రిడ్జికి తగిలింది. దీంతో సుప్రజ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. ఆమె కుమారుడు అక్షత్ స్వల్పంగా గాయపడ్డాడు. వీరితో పాటు అక్కడే ఉన్న మరో చిన్నారి తీవ్రంగా గాయపడినట్లు తెలస్తోంది. భారత కాలమాన ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మృతురాలిది సంతమాగులూరు మండలం మక్కేనవారిపాలెం. ఆమె తండ్రి సంతమాగులూరు మాజీ జడ్పీటీసీ సభ్యుడు తేళ్ల శ్రీనివాసరావుగా తెలుస్తోంది. ప్రమాద ఘటనతో మక్కేనవారిపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.