Parents donate their 18-month-old son to Dera baba Ashram under superstitious beliefs
mictv telugu

డేరాబాబాకు బాలుడి దానం.. మొక్కు తీర్చుకున్నం..

November 11, 2022

ఆధునిక యుగం, నాగరిక ప్రపంచం అంటూ ఏదేదో అనుకుంటాం కానీ.. మన చుట్టూ ఉన్న సమాజంలో మూఢనమ్మకాలతో బతుకుతున్న వాళ్లు ఎందరో. వాళ్ల చేష్టలు చూస్తే అజ్ణానులు అనాలో, మూర్ఖులు అనాలో కూడా తెలియదు. అవును మరి. చదువుకొని, ఉద్యోగాలు చేసుకునే ఆ దంపతులు మొక్కు పేరుతో పసిబిడ్డ అని కూడా చూడకుండా కన్నకొడుకుని ఆశ్రమానికి దానమివ్వడం ఏంటీ?. వినడానికే విచిత్రంగా ఉన్న ఈ ఘటన హరియాణాలోని కైతాల్‌లో చోటుచేసుకుంది. ఏడాదిన్నర బాలుడిని డేరాబాబా ఆశ్రమానికి విరాళంగా ఇచ్చారు అతడి తల్లిదండ్రులు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబాలాకు చెందిన దంపతులకు ఓ కుమార్తె ఉంది. వారికి కొడుకు పుడితే డేరా ఆశ్రమానికి దానం చేస్తామని మొక్కుకున్నారట. ఇది ఆ చిన్నారి అమ్మమ్మ సాధ్వి ప్రభ ముని ఉచిత సలహా. డేరా బాబా ఆశ్రమంలోనే పనిచేస్తున్న ప్రభ ముని.. తన కూతురు, అల్లుడికి.. మగసంతానం కలిగితే డేరా బాబా ఆశ్రమానికి దానం చేస్తామని మొక్కుకోమని చెప్పిందట. ఆయన అనుగ్రహం ఉంటే ఇంకా మగపిల్లలు పుడతారని, మరేం పర్లేదని నమ్మించింది. ప్రస్తుతం ముంబయిలో ఉద్యోగం చేస్తున్న చిన్నారి తల్లిదండ్రులు.. ఆమె చెప్పినట్లే ఏడాదిన్నర కొడుకును డేరాబాబా ఆశ్రమానికి దానం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆశ్రమానికి చేరుకుని దర్యాప్తు చేశారు. చిన్నారిని ఆశ్రమం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులను ముంబయి నుంచి కైతాల్కు పిలిపించారు. డీఎస్పీ ఆదేశాల మేరకు బాలుడిని తిరిగి తీసుకున్నారు. ఈ ఘటన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికి చేరగా.. వెంటనే దర్యాప్తునకు ఆదేశించింది.