Parents kidnapped their daughter and shaved her head in Jagityal
mictv telugu

ప్రేమ పెళ్లి చేసుకుందని కిడ్నాప్ చేసి గుండు కొట్టించిన పేరెంట్స్

November 15, 2022

Parents kidnapped their daughter and shaved her head in Jagityal

తమకు నచ్చని వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న కూతురిపై తల్లిదండ్రులు అమానవీయంగా ప్రవర్తించారు. అన్ని హద్దులూ మీరి కిడ్నాప్‌కు తెగబడ్డారు. రాత్రంతా హింసించి శిరోముండనం చేశారు. పదునైన మాటలతో మనసు మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు వదిలిపెట్టారు.

కన్నవారు ఎంత చిత్ర హింసలు పెట్టినా చివరకు కట్టుకున్న వాడే కావాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఓ యువతి. జగిత్యాల జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇదిగో.. రూరల్ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు అనే యువకుడు రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన అక్షితలు ప్రేమించుకున్నారు. యువతి తల్లిదండ్రులు పెళ్లికి అభ్యంతరం చెప్పడంతో ఇద్దరూ కలిసి రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో అక్షిత పుట్టింటిని వదిలి అత్తారింట్లో భర్తతో కాపురం చేస్తుంది. ఇదిలా ఉంటే కుమార్తె అలా పెళ్లి చేసుకొని వెళ్లిపోవడాన్ని అవమానంగా భావించిన ఆమె తల్లిదండ్రులు రెండు కార్లలో బంధువులతో సహా వచ్చి మధు కుటుంబంపై దాడి చేశారు. కూతురిని కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టారు. ఆమె కేకలు వేస్తున్నా వినకుండా బలవంతంగా శిరోముండనం చేయించారు. అయినా మాట వినకపోవడంతో వదిలేశారు. దీంతో నేరుగా పోలీస్ స్టేషన్ చేరుకున్న అక్షిత జరిగిన దారుణాన్ని వారికి వివరించింది. దీంతో తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఆమెను భర్త మధుకు అప్పగించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.