Parents of Kodikatti Srinivas are demanding justice
mictv telugu

జగన్ కోడి కత్తి కేసు.. ఆమరణ దీక్షకు సిద్ధమంటున్న తల్లిదండ్రులు

October 20, 2022

Parents of Kodikatti Srinivas are demanding justice

సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉండగా జరిగిన కోడి కత్తి దాడి వ్యవహారం తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది. తమ కుమారుడిని వెంటనే విడుదల చేయాలని, లేకపోతే సీఎం క్యాంపు కార్యాలయం లేదా సీఎం ఇంటి వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావు తల్లిదండ్రులు తాతారావు, సావిత్రిలు తమ స్వగ్రామమైన కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలో గురువారం మీడియాతో మాట్లాడారు.

నాలుగేళ్లుగా రిమాండు ఖైదీగా జైల్లో మగ్గుతున్నాడని, శుభ, అశుభ కార్యక్రమాలకు కూడా అనుమతి ఇవ్వడం లేదని వాపోయారు. దాడి ఘటనలో జగన్ ఫిర్యాదు చేయకుండానే ఎయిర్ పోర్టు, ఎన్ఐఏ అధికారులు కేసు పెట్టారని ఆరోపించారు. వృద్ధాప్యంలో ఉన్న తమను చూసుకునే ఏకైక ఆధారమైన కొడుకు కోసం పోరాడకపోతే ప్రయోజనం ఏంటని అభిప్రాయపడ్డారు. మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి ములాఖత్ తీసుకుంటాం. తర్వాత సీఎంని కలిసి న్యాయం చేయమని కోరతాం. స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ప్రకటించారు. ధనికులకు ఓ న్యాయం, పేదలకు ఓ న్యాయం జరుగుతుందని, దళితులం కాబట్టే తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన చెందారు.