దేశంలో రోజురోజుకు కరోనా సృష్టిస్తున్న విషాదాలు అన్నీ ఇన్నీ కావు. అభంశుభం తెలియని ఓ 9నెలల శిశువుని కరోనా బలితీసుకుంది. ఇదో విషాదం అయితే.. మరో విషాదం ఏంటంటే, ఆ బిడ్డ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు నిరాకరించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మే 26న ఈ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో ఓ శిశువు మృతిచెందాడు. చనిపోయాక ఆ శిశువుకు కరోనా ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా బిడ్డ తల్లిదండ్రులకు ఆసుపత్రి అధికారులు సమాచారం అందించారు.
అయితే ఆ తల్లిదండ్రులు బిడ్డను తీసుకెళ్లమని.. చూడను కూడా చూడమని చెప్పారు. తమది ఉత్తరప్రదేశ్ అని, ఢిల్లీలో ఉండగా తమ డబ్బంతా అయిపోయిందని వారు చెప్పారు. దీంతో ఇంటికి తిరిగొచ్చామని చెప్పారు. ఢిల్లీలో ఉండగా శిశువు మృతదేహం కోసం మూడు రోజుల పాటు ఎదురు చూశామని, కానీ ఆసుపత్రి వర్గాలు మాత్రం స్పందించలేదని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ వచ్చే స్థోమత తమకు లేదని చెప్పారు. ఆసుపత్రి వర్గాలే తమ బిడ్డకు అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. దీంతో ఆసుపత్రి వర్గాలు తదుపరి చర్యల గురించి ఆలోచనలో పడ్డాయి.