బర్త్‌డే పార్టీ పేరుతో 35 ఏళ్ల వ్యక్తితో.. తల్లిదండ్రులే తెగబడ్డారు - MicTv.in - Telugu News
mictv telugu

బర్త్‌డే పార్టీ పేరుతో 35 ఏళ్ల వ్యక్తితో.. తల్లిదండ్రులే తెగబడ్డారు

May 16, 2022

పుట్టినరోజు వేడుకలు జరుపుతామంటూ 12 ఏళ్ల బాలికను మభ్యపెట్టి 35 ఏళ్ల వ్యక్తికిచ్చి తల్లిదండ్రులే వివాహం జరిపించిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. వివరాలు.. కేశంపేట మండలం పాపిరెడ్డిగూడకు చెందిన దంపతులకు మైనారిటీ తీరని కుమార్తె ఉంది. పేదరికం కారణంగా యువతిని కట్నం లేకుండా పెళ్లి చేసి పంపే పరిస్థితి ఆ కుటుంబానికి లేదు. దీంతో మైనారిటీ తీరకుండానే బాలికకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఇందుకు కూతురు ఒప్పుకోదని గ్రహించి తన పుట్టినరోజు వేడుకలు చేస్తున్నామంటూ బాలికను మభ్యపెట్టారు. ఆ పేరుతో 35 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం జరిపించేశారు. తర్వాత అసలు వాస్తవం గ్రహించిన బాలిక తనకు పెళ్లి ఇష్టం లేదంటూ కోపంతో బంధువుల ఇంటికి వెళ్లింది. కుమార్తెను వెతుక్కుంటూ బంధువుల ఇళ్లకు వెళ్లిన తల్లిదండ్రులకు బంధువులతో గొడవ జరిగింది. దాంతో బాలిక అక్కడ్నుంచి కూడా తప్పించుకొని వెళ్లిపోయింది. అయితే ఈ ఘటన గురించి తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు బాలికను గుర్తించి ఆశ్రయమిచ్చారు. దాంతో బాలిక జరిగిందంతా అధికారులకు వివరించింది. దాంతో వారు పోలీసులకు సమాచారమందించడంతో వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మైనారిటీ తీరకముందే బాలబాలికలకు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం. అయినా చట్టాన్ని కాదని ఇంకా అనేక చోట్ల బాల్యవివాహాలు జరుగుతున్నాయి. అయితే మరీ ఘోరంగా 23 ఏళ్ల వ్యక్తితో పెళ్లి జరిపించడమేంటని బాలిక బంధువులు కూడా ఆమె తల్లిదండ్రులను తిట్టిపోస్తున్నారు. కాగా, యువతుల కనీస వివాహ వయస్సును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు గతేడాది కేంద్ర కేబినెట్ పెంచిన విషయం తెలిసిందే.