ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న కాకినాడ శ్రీపీఠ అధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామికి అధిష్టానం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై తెలంగాణ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనను ఏకంగా సీఎం అభ్యర్థి అని ప్రచారం చేయడం సరికాదని అంటున్నారు. ఆంధ్ర ప్రాంత స్వామిని తమపై బలవంతంగా రుద్దుతున్నారని మండిపడుతున్నారు. మరోపక్క.. పరిపూర్ణను ఎక్కడి నుంచి బరిలోకి దింపాలన్న అంశంపై పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఆయనను జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దింపాలనే ప్రతిపాదన వచ్చిందని, దీనిపై రాష్ట్ర నేతలతో మంతనాలు జరుపుతున్నారని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. వాస్తవానికి శనివారం ప్రకటించిన 38 మంది అభ్యర్థుల జాబితాలో పరిపూర్ణ పేరుగా ఉండాల్సిందని, అయితే రాష్ట్ర నేతల నుంచి అభ్యంతరం రావడంతో మలి జాబితాకు మార్చారని తెలిపారు. పరిపూర్ణను అమిత్ షా ఢిల్లీకి రెండు సార్లు పిలిపించుకోవడం టికెట్ గురించి మాట్లాడటానికే అని చెప్పారు.
జూబ్లీహిల్స్లో 2014లో మాగంటి గోపీనాథ్ బీజేపీ, టీడీపీ పొత్తు కింద టీడీపీ నుంచి పోటీ చేసి 9వేల పైచిలుకు మెజారితో గెలిచారు. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగారు. గత ఓటు బ్యాంకు కొంత, పరిపూర్ణ హిందుత్వ ఇమేజీ కొంత ఆయన గెలుపుకు దోహదం చేస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధిష్టానానిదే తుది నిర్ణయమని చెబుతున్నారు.