అనంతపురం జిల్లా కొత్తపల్లిలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ టీడీపీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. టీడీపీ నేత జగ్గును విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. వీరికి మద్దతుగా టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఏం జరిగిందంటే..
ఇటీవల వైసీపీ నాయకులు పరిటాల కుటుంబంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇరుపార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి పరిటాల కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల కుటుంబాన్ని భూస్థాపితం చేస్తామని, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ను చంపేస్తామని హెచ్చరించారు. దీనిపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. కౌంటర్‌గా బత్తలపల్లికి చెందిన జగ్గు తీవ్ర స్థాయిలో వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు అతనిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. స్టేషన్లోనే అతనిపై దాడి చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతని వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని చెబుతున్నారు. జగ్గు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. రోడ్డుపై బైఠాయించి మాజీ మంత్రి పరిటాల సునీత పరిటాల శ్రీరామ్, సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఆందోళన చేస్తున్నారు. టీడీపీ నేత జగ్గును విడిచిపెట్టేవరకు ఆందోళన విరమించేది లేదని పరిటాల సునీత తేల్చి చెప్పారు.