ఢిల్లీ క్యాపిటల్స్ బస్సుపై దాడి.. తప్పిన ప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ క్యాపిటల్స్ బస్సుపై దాడి.. తప్పిన ప్రమాదం

March 16, 2022

ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందే ఢీల్లీ క్యాపిటల్స్‌కు ప్రమాదం ఎదురైంది. మ్యాచ్ కోసం జట్టు సభ్యులతో ముంబై చేరుకున్న బస్సుపై దాడి జరిగింది. ఈ దాడిలో భాగంగా బస్సులో జట్టు సభ్యులు ఎవరు లేకపోవడంతో అందరు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కోవిడ్‌ నేపథ్యంలో ఈ సీజన్‌ లీగ్‌ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోని నాలుగు వేదికల్లో నిర్వహించనుండగా, ఇందుకోసం అన్ని జట్లతో పాటు ఢిల్లీ కూడా ఇప్పటికే ముంబై చేరుకుంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నగరంలోని తాజ్ హోటల్ వద్ద పార్క్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బస్సుపై ఓ ప్రాంతీయ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు దాడి చేశారు. అయితే, దాడి జరిగిన సమయంలో బస్సులో ఆటగాళ్లెవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

అంతేకాకుండా దాడికి పాల్పడిన దుండగులు బస్సుపై పోస్టర్లు అతికించడంతో పాటు మరాఠీలో నినాదాలు చేస్తూ కర్రలు, రాడ్లతో అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేసినట్టు సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఐపీఎల్‌ కోసం స్థానిక వాహనాలను కాకుండా పక్క రాష్ట్రాల బస్సులను వినియోగిస్తున్నారన్న అక్కసుతో ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 143, 147, 149, 427 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ముంబై పోలీసులు తెలిపారు.

మరోవైపు ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఈనెల 26 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. 27న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టాల్సి ఉంది. ఇందుకోసం డీసీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్, అసిస్టెంట్ కోచ్ జేమ్స్ హోప్స్, కెప్టెన్‌ రిషబ్‌ పంత్ సహా పలువురు ఆటగాళ్లు ఇప్పటికే ముంబైకి చేరుకుని సన్నాహకాలు ప్రారంభించారు.